ఐఏఎస్‌ చదివేవారి బాధ్యత తీసుకుంటాం | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ చదివేవారి బాధ్యత తీసుకుంటాం

Published Sun, Nov 20 2016 9:08 PM

ఐఏఎస్‌ చదివేవారి బాధ్యత తీసుకుంటాం

డాక్టర్‌ వైఎస్సార్‌–కేవీఆర్‌ ట్రస్ట్‌ ఎండీ కళ్లం హామీ 
 
తాడేపల్లి (తాడేపల్లి రూరల్‌) : ఐఏఎస్, ఐపీఎస్‌ చదవడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి డాక్టర్‌ వైఎస్సార్‌–కేవీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పూర్తి బాధ్యత వహిస్తామని ట్రస్టు ఎండీ కళ్లం రాజశేఖర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పక్కాగా అమలు చేశారని కొనియాడారు. ప్రస్తుతం ఆ పథకం అస్తవ్యస్తంగా సాగుతోందని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు డాక్టర్‌ వైఎస్సార్‌–కేవీఆర్‌ ట్రస్టు తరఫున వారి బాధ్యతలు తీసుకుని పూర్తి సహాయ సహకారాలు అందించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే తాడేపల్లి మున్సిపల్‌ పరిధిలో ఉచిత అంబులెన్స్, స్వర్గపురి వాహనం, రెండు రూపాయలకే మినరల్‌ వాటర్‌ ప్లాంట్, కర్మకాండల భవనం, కళ్లం వెంకటరెడ్డి పాఠశాలలో ప్రతి రోజూ మినరల్‌ వాటర్‌ అందించడంతో పాటు పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు వివరించారు. ట్రస్టు ఆధ్వర్యంలో భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కొయ్యగూర మహాలక్ష్మి, వైఎస్సార్‌ సీసీ పట్టణ కన్వీనర్‌ బుర్రముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి, కౌన్సిలర్లు కేళి వెంకటేశ్వరరావు, లక్ష్మీరోజా, మాజీ ఎంపీటీసీ శివరామిరెడ్డి, గాంధీ, మేకా వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement