సంబురానికి సిద్ధం | Sakshi
Sakshi News home page

సంబురానికి సిద్ధం

Published Fri, Jun 2 2017 2:01 AM

సంబురానికి సిద్ధం

జిల్లాలో తొలిసారిగ అవతరణోత్సవాలు
మూడు రోజులపాటు జరగనున్న వేడుకలు
ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు
డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి సమీక్ష
ధగధగా మెరిసిపోతున్న కార్యాలయాలు

సాక్షి, మెదక్‌: జిల్లాలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలు జరగనున్నాయి. మూడేళ్ల వేడుకలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు మెదక్‌ ఇందిరాగాంధీ స్టేడియంలో జెండా వం దనంతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. శనివారం అమ్మఒడి పథకం ప్రారంభమవుతుంది. కేసీఆర్‌ కిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.

ఆదివారం అన్ని నియోజకవర్గాల్లో ఒంటరి మహిళలకు ఎమ్మెల్యేలు పింఛన్లను పంపిణీ చేస్తారు. శుక్రవారం మెదక్‌లో జరిగే వేడుకలకు డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆమె జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభిస్తారు. అనం తరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అమరవీరుల కుటుంబాలను సన్మానిస్తారు. చివరగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. ఆ తర్వాత, వివిధ విభాగాల నుంచి ఎంపిక చేసిన ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేస్తారు. కార్యక్రమంలో కలెక్టర్‌ భారతి హోళికేరి, ఎస్పీ చందన దీప్తి, జాయింట్‌ కలెక్టర్‌ సురేష్‌బాబుతోపాటు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.

వైభవంగా వేడుకలు నిర్వహించాలి
జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరపాలని డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. వేడుకల నిర్వహణపై గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ భారతిహోళికేరి, ఎస్పీ చందన దీప్తితో కలిసి అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అవతరణ వేడుకలు వైభవంగా జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వ కార్యాలయా లను విద్యుద్దీపాలతో అలంకరించాలని, అధికారులు అంతటా వేడుకల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ భారతి హోళికే రి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పంచాయతీల్లో వేడుకలు నిర్వహించాలన్నారు. ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ అవతరణ వేడుకలకు హాజర య్యే ప్రతి ఒక్కరు గుర్తింపు కార్డులు తీసుకురావాలని కోరారు.  

మెరిసిపోతున్న కార్యాలయాలు
రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని కలెక్టరేట్‌ సహా ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మున్సిపల్‌ కార్యాలయం, పట్టణ పోలీస్టేషన్, ఇంజినీరింగ్‌ కార్యాలయాలు రంగుల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. మెదక్‌ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సైతం విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు.

పది మందికి అవార్డుల ప్రదానం
వివిద రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పది మందికి రాష్ట్ర అవతరణ వేడుకల్లో అవార్డులు ప్రదానం చేయనున్నారు. డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి శుక్రవారం ఇందిరాగాంధీ స్టేడియంలో వీరికి అవార్డులు అందజేస్తారు.  

   రంగం                                               పేరు

ఉత్తమ అర్చకులు                            భాష్యం మధుసూదనాచార్యులు (చేగుంట)
ఉత్తమ ఎన్‌జీఓ                                టిటూస్‌ జో ముర్రే (ఆగ్రోస్‌ స్వచ్ఛంద సంస్థ–మెదక్‌)
ఉత్తమ పంచాయతీ                           మల్కాపూర్‌ (తూప్రాన్‌ మండలం)
ఉత్తమ పంచాయతీ (ప్రత్యేక కేటగిరి)      ఇబ్రహీంపూర్‌–వందశాతం పారిశుద్ధ్యం (చేగుంట)
ప్రత్యేక విభాగం                               మంజు, కేజీవీబీ చిన్నశంకరంపేట, (పర్వాతారోహణం)
సాహితీరంగం                                  వెంకటేశ్‌గౌడ్‌ (శివ్వంపేట)
ఉత్తమ ఆర్టిస్టు                                గుడాల సత్యనారాయణ (మెదక్‌)
ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామికవేత్త        రాగి చంద్రశేఖర్‌ (మెదక్‌)
ఉత్తమ అంగన్‌వాడీ వర్కర్‌                 ఎన్‌.సువర్ణ (అల్లాదుర్గం)
ఉత్తమ క్రీడాకారుడు                          సండ్ర వినోద్‌ (శివ్వంపేట).
 

Advertisement
Advertisement