6,400 ‘వైద్య’ ఖాళీల భర్తీ | Sakshi
Sakshi News home page

6,400 ‘వైద్య’ ఖాళీల భర్తీ

Published Sat, Aug 1 2015 1:36 AM

6,400 ‘వైద్య’ ఖాళీల భర్తీ - Sakshi

నాన్-డాక్టర్ క్యాడర్ పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదన
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వం రెండో విడత ప్రకటించబోయే ఉద్యోగ ప్రకటనలో వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులు కూడా ఉంటాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. ‘వైద్య’ ఖాళీల భర్తీపై సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ప్రాధాన్యత రంగాన్ని విస్మరిస్తోందంటూ వైద్యం ‘పోస్ట్’పోన్ శీర్షికన ‘సాక్షి’ ఇటీవల ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు. తమ శాఖలో 6,400 నాన్-డాక్టర్ క్యాడర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదించారు. అయితే వీటిలో ఎన్ని పోస్టుల భర్తీకి సర్కారు పచ్చజెండా ఊపుతుందో స్పష్టత రావడం లేదు. ఆర్థికశాఖ ఎన్నింటికి ఆమోదం తెలుపుతుందో చూడాలని వైద్యశాఖ అధికారులు అంటున్నారు. డాక్టర్ పోస్టులు రాష్ట్రస్థాయి క్యాడర్ అయినందున వాటి నియామకం ఇప్పుడు జరగదని... జోనల్, జిల్లా స్థాయి నాన్-డాక్టర్ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తారని చెబుతున్నారు.
 
 పారామెడికల్, నర్సింగ్ పోస్టుల భర్తీ...
 
 పీహెచ్‌సీ మొదలు రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఆస్పత్రుల వరకు ఖాళీగా ఉన్న నర్సింగ్, పారామెడికల్, టెక్నీషియన్ ఇతర వైద్య సిబ్బంది పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. వాటిని ఎలా భర్తీ చేయాలన్న అంశంపై నోటిఫికేషన్‌లో స్పష్టత ఇవ్వనుంది. వైద్య ఆరోగ్యశాఖ మాత్రం 6,400 పోస్టులు భర్తీ చేస్తే ఉపయోగకరమని చెబుతోంది. ఉదాహరణకు ఉస్మానియా ఆస్పత్రిలో ఐదుగురు నర్సులు ఉండాల్సిన చోట ఒక్కరితోనే నడిపించాల్సి వస్తోందని... అందువల్ల అవసరమైనన్ని పోస్టులను భర్తీ చేయాలని కోరుతోంది.


 

Advertisement
Advertisement