హరికథామృతం | Sakshi
Sakshi News home page

హరికథామృతం

Published Fri, Sep 2 2016 5:27 PM

హరికథామృతం - Sakshi

‘శ్రీమద్రమారమణ గోవిందా హరి’ .. అంటూ హరిదాసు ధీర గంభీర స్వరంతో పలికే పలుకులు ఈ రోజుల్లో వినటం చాలా అరుదు.  భక్తిరసభరితంగా, కర్ణపేయంగా సాగే హరికథలు ఒకప్పుడు పల్లెపల్లెన, పట్టణాల్లోనూ ప్రతిధ్వనించేవి..తెల్లవార్లు వందలాదిమంది భక్తులు ఆ కథలను ఆసక్తిగా విని తరించేవారు. లలితకళల సమాహారంగా అభివర్ణించే హరికథకు నేటికీ ఆదరణ లభిస్తుందని నగరంలో శ్రీ ఆదిభట్ల శ్రీ కళాపీఠం నిర్వహించిన మూడు రోజుల ‘హరికథా మహోత్సవం–2016’ రుజువు చేసింది.    – విశాఖ–కల్చరల్‌
మన ప్రాచీన కళ ఆధునిక సమాజాన్ని అయస్కాంతంలా ఆకర్షించింది. సాంస్కృతిక రాజధానిగా వినుతికెక్కిన విశాఖలో హరికథ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. హరికథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు ఆశయ సిద్ధి కొత్త రెక్కలు తొడిగింది. పూర్వాశ్రమం లో హరికథా భాగవతారిణి, శాస్త్రీయ నత్యకారిణి, నగరాని కి చెందిన సినీనటి కల్యాణి 2011లో స్థాపించిన శ్రీఆదిభట్ల శ్రీకళాపీఠం అద్భుతాలు సష్టిస్తోంది. అష్ట భాషా ప్రవీ ణుడు సంగీత, నత్య, సాహితీ రంగాలలో లబ్ధప్రతిషు్ఠలైన ఆదిభట్ల 152వ జయంతి సందర్భంగా శ్రీకరకచెట్టు పోల మాంబ ఆలయ ప్రాంగణంలో శ్రీఆదిభట్ల శ్రీకళాపీఠం మూడు రోజుల ‘హరికథా మహోత్సవం–2016’ ఏర్పాటు చేసింది. శుక్రవారంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. కల్యాణి సారథ్యంలో హరికథా మహోత్సవాలు నిర్వహించ డం మొదలైనప్పట్నుంచీ మునుపెన్నడూ లేని విధంగా నగ ర జనం హరికథల్ని ఆస్వాదిస్తున్నారనడంలో   సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే హరికథకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆంధ్ర, తెలంగాణ అన్న తేడా లేకుండా కళాకారులందర్నీ సమానంగా స్వీకరించడం ఈ ఉత్సవాల ప్రత్యేకత. నిజానికి తెలుగునేల నలు చెరగుల నుంచి పేరెన్నికగన్న హరికథకులు ఈ ఉత్సవంలో పోటాపోటీగా పాల్గొన్నారు. ఈ హరికథా సప్తాహానికి సినీ తారలు పోటెత్తిరావడం ఒక ఒరవడి. సాగరతీరంలోని ఆదిభట్ల విగ్రహానికి సుమన్‌తో∙క్షీరాభిషేకం చేయించి హరికథల సప్తాహాన్ని ప్రారంభించడం సంస్థ ఆనవాయితీ. సాయంత్రం పెదవాలే్తరులోని శ్రీకరకచెట్టు పోలమాంబ ఆలయ ప్రాంగణంలో ఈ రసవత్తర ప్రదర్శనలు జరుగుతాయి. హరికథా కళారూపాన్ని సజీ వంగా ఉండటానికి మొక్కవోని దీక్షతో పనిచేసే కళాకారులకు ‘హరికథా సుధానిధి’ బిరుదు ప్రదానం చేయడం కళాపీఠం వ్యవస్థాపకుల ఆశయాలలో ఒకటి.  వెండి తెర, బుల్లి తెరలపై రాణిస్తున్న కళాకారిణి కల్యాణి గత ఏడేళ్లుగా క్రమం తప్పకుండా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.  వారం లేదా మూడు రేయింబవళ్లు జరిగే ఈ కార్యక్రమంలో తాను కూడా ఓ కథ చెప్పి ప్రేక్షకుల్ని ఆమె ఆనందపరుస్తారు. సీతా కల్యాణం, వల్లీ కల్యాణం లేదా  రుద్రాక్ష తులాభారం కథలు చెప్పటంలో ఆమె దిట్ట. నటిగా, గాయనిగా వ్యాఖ్యాతగా ప్రత్యేక గుర్తింపు సాధించిన కల్యాణి అంతర్జాతీయ వేదికపై తెలుగు జాతి ప్రాచీన కళావైభవ దీప్తిని రెపరెపలాడించే పనిలో నిమగ్నమయ్యారు. గత ఏడాది హైదరాబాద్‌లో అత్యధిక సంఖ్య లో కథకులతో ఏకథాటిగా హరికథాగానం చేయించి ‘లిమ్కా రికార్డు’ సాధించారు. 
ఆదిభట్ల పేరిట హరికథా విభాగం ఏర్పాటు కావాలి
విజయనగరం ప్రభుత్వ సంగీత కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపాల్‌ ఆదిభట్ల నారాయణ దాసు. ఆయన పేరిట ఆ ప్రాంగణంలో హరికథా విభాగం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలి. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హరికథాకళాకారులకు గౌరవ ప్రదమైన జీవనభతి కల్పించాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ గుర్తింపు పొందిన కళాకారులకు ప్రభుత్వం ఇచ్చే మొక్కుబడి పారితోషికం గౌరవప్రదంగా ఉండేలా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం హరికథల అభివృద్ధికి, పరిశోధనకు తగిన సువిశాల ప్రాంగణం అందుకు తగిన వనరులు, వసతులు సమకూర్చాలి.  
– కల్యాణి, అధ్యక్షురాలు, శ్రీఆదిభట్ల శ్రీకళాపీఠం
 
సంకల్ప బలం గొప్పది
ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థితికి రావాలి. పైకి వచ్చిన వారు తమ పూర్వ రంగాన్ని, పూర్వపు స్థితిగతుల్ని గుర్తుపెట్టుకోవాలి. నటి కల్యాణి విషయంలో ఈ సిద్ధాంతం నూటికి నూరుపాళ్లు నిజం. ఉత్సవాల నిర్వహణ అంత ఆషామాషీ కాదు. కల్యాణి తన శక్తికి మించి హరికథల కోసం శ్రమిస్తున్నారు. ఏటా కార్తీక హరికథ మహోత్సవాలు, ఆదిభట్ల జయంతి ఉత్సవాలు నిర్వహించటం అభినందనీయం.
– సప్పా భారతి, హరికథా భాగవతారిణి 
 

Advertisement
Advertisement