తక్షణం పంటలకు నీరు విడుదల చేయాలి | Sakshi
Sakshi News home page

తక్షణం పంటలకు నీరు విడుదల చేయాలి

Published Thu, Aug 18 2016 6:09 PM

తక్షణం పంటలకు నీరు విడుదల చేయాలి - Sakshi

సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు
 
గుంటూరు వెస్ట్‌ : జిల్లావ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కారణంగా పంటలు ఎండిపోతున్నాయని తక్షణమే ఖరీఫ్‌ పంటకు నీరు విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రభుత్వాన్ని కోరారు. బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 4 లక్షల ఎకరాలలో పత్తి, 8 లక్షల ఎకరాలలో వరి, ఇతర పంటలు నీరు లేక ఎండిపోయే పరిస్థితి దాపురించిందన్నారు. అనేకచోట్ల వరి విత్తనాలను ఎద పెట్టారని, అవి మొలకెత్తాలన్నా, మిర్చి పంట వేయాలన్నా కాల్వల్లో నీరు లేదని చెప్పారు. సాగర్‌ ఆయకట్టుకు నీరు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని, ఎగువన వర్షాలు పడి శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు నీరు చేరిందని పేర్కొన్నారు. ప్రస్తుతం వేసిన బీపీటీ వరి నాణ్యమైన పంట రావాలన్నా, దిగుబడి పెరగాలన్నా ప్రస్తుతం నీరు తప్పనిసరన్నారు. జలఫిరంగులు వాడకానికి కూడా చెరువులు, కుంటల్లో నీరు లేదన్నారు. తక్షణమే నీరు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని, లేకుంటే ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. 

Advertisement
Advertisement