రవిప్రకాశ్‌వన్నీ అసత్యాలే! | Sakshi
Sakshi News home page

రవిప్రకాశ్‌వన్నీ అసత్యాలే!

Published Wed, Jun 12 2019 1:51 AM

TV 9 new and old owners Prepared for legal action on Ravi Prakash - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమ సంస్థలపై అసత్య, పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేయడంపై టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, పాత యాజమాన్యం శ్రీనిరాజు సంస్థలైన చింతలపాటి హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఐల్యాబ్స్‌ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. ప్రధానంగా టీవీ 9 ప్రస్తుత ప్రమోటర్లైన అలంద మీడియా, పాత ప్రమోటర్లైన శ్రీనిరాజు సంస్థల మధ్య లావాదేవీల్లో చెల్లింపులు అక్రమంగా హవాలా మార్గంలో జరిగాయని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ చేసిన వాదనలు అవాస్తవం అని ప్రకటించాయి. ఫోర్జరీకి పాల్పడి క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కుని, అరెస్టును ఎదుర్కొంటున్న రవిప్రకాశ్, ఎలాగైనా బెయిల్‌ను పొందడం కోసం తమపై నిరాధార ఆరోపణలు ప్రచారంలోకి తీసుకురావడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నాయి.

విచారణ అధికారుల ముందు, కోర్టులోనూ రవిప్రకాశ్‌ చేసిన ఆరోపణలకు ఎలాం టి ఆధారాలు లేవని ఒక ప్రకటనలో తెలిపాయి. కోర్టులో రవిప్రకాశ్‌ తరఫు న్యాయవాది చేసిన వాదనల ఆధారంగా మీడియాలో వచ్చిన వార్తలను ఖం డించాయి. ఫోర్జరీ, చీటింగ్‌ కేసుల్లో తాను ఎదుర్కొంటున్న విచారణను పక్కదారి పట్టించడం కోసమే రవిప్రకాశ్‌ ఈ ఆరోపణలకు దిగారంటూ విమర్శిం చా యి. వాస్తవాలను వెల్లడించడంలో భాగంగా టీవీ9 విక్రయ లావాదేవీల వివరాలను కొత్త, పాత యాజమాన్యాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. 

డీల్‌ విలువ రూ.414 కోట్లు... 
‘2018, ఆగస్టు నాటికి చింతలపాటి హోల్డింగ్స్, ఐ ల్యాబ్స్, క్లిపోర్డ్‌ ఫెరీరా, ఎంవీకేఎన్‌ మూర్తిలకు టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్‌లో 90.54 శాతం వాటా ఉండేది. ఈ వాటా మొత్తాన్ని ఆగస్టు 24, 2018న అలంద మీడియా కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ రూ.414 కోట్లు. దీనికి సంబంధించిన షేర్‌ పర్చేజ్‌ ఒప్పందాన్ని చట్టబద్ధంగా చేసుకుని, నిధుల బదిలీని పూర్తిగా బ్యాంకుల ద్వారానే జరిపింది. రవిప్రకాశ్‌ ఆరోపిస్తున్నట్లు ఇందులో ఎలాంటి నగదు లావాదేవీ అన్నదే జరగలేదు. ఏబీసీఎల్‌కు అప్పటికి ఉన్న బకాయిలను చెల్లించడానికి అలంద మీడియా రూ.150 కోట్లు నేరుగా సంస్థ ఖాతాల్లోకి బదిలీ చేయగా, మిగిలిన రూ.264 కోట్లు పాత ప్రమోటర్లకు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిగాయి. ఈ లావాదేవీలు పాత, కొత్త ప్రమోటర్ల రికార్డుల్లో నమోదయ్యాయి. సంస్థ యాజమాన్య బదిలీపై కేంద్ర సమాచార ప్రసార మం త్రిత్వ శాఖకు కూడా సమాచారమిచ్చాం.

ఈ వ్యవహారమంతా చట్టపరిధిలోనే జరిగింది తప్ప, ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదు’అని వివరించాయి. ‘ఈ బదిలీ వ్యవహారం ఆగస్టు 2018 లోనే జరిగింది. ఆ సమయంలో టీవీ9 సీఈవోగా ఉన్న రవిప్రకాశ్, షేర్‌పర్చేజ్‌ అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేశారు. అయినప్పటికీ, 9 నెలల తర్వాత, రవిప్రకాశ్‌ ఈ ఆరోపణలు చేయడం చూస్తుంటే, ఫోర్జరీ కేసుల విషయంలో తాను ఎదుర్కొంటున్న క్రిమినల్‌ విచారణను పక్కదారి పట్టించడానికి, తనను తాను కాపా డుకోవడానికి చేస్తున్న పనే అని అర్థమవుతోంది. సైఫ్‌ త్రీ మారిషస్‌తో కుదిరిన సెటిల్మెంట్‌ వ్యవహారం పైనా రవిప్రకాశ్‌ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. టీవీ9 విక్రయం జరిగే సమయానికి హైదాబాద్‌లోని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సైఫ్‌ త్రీ కంపెనీ వేసిన ఓ కేసు పెండింగ్‌లో ఉంది.

ఐ విజన్‌లో ఉన్న వాటాల విషయంలో సైఫ్‌ త్రీ ఈ కేసు వేసింది. అయితే.. ఇది సెటిల్మెంట్‌ అగ్రిమెంట్‌ ద్వారా పరిష్కారం అయ్యింది. దీనికి సంబంధించి ఆర్‌బీఐ నియమ నిబంధనలకు లోబడి బ్యాంకుల ద్వారానే చెల్లింపు జరిగింది. నిధులను స్వీకరించిన తర్వాత, సైఫ్‌ త్రీ కేసును ఉపసంహరించుకోవడానికి ఎస్‌సీఎల్‌టీ అనుమతి కూడా ఇచ్చింది. వాస్తవాలు ఇలా ఉంటే, రవిప్రకాశ్‌ మాత్రం ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగినట్లుగా అవాస్తవమైన, అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలతో ప్రభావితం కావొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తమ పరువుకు భంగం కలిగించేలా అసత్యమైన, పూర్తిగా అవాస్తమైన ఆరోపణలను రవిప్రకాశ్‌ చేసినందుకు న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం’అని స్పష్టం చేశాయి.

Advertisement
Advertisement