వివాహితకు కొత్త చిక్కులు తెచ్చిన ఫేస్‌బుక్‌ | Sakshi
Sakshi News home page

ఫేస్‌‘బుక్‌ చేసింది’

Published Sat, Mar 10 2018 6:50 AM

Facebook Friends Cheated Married Woman  - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఓ వివాహితకు ఫేస్‌బుక్‌ స్నేహాలు కొత్తచిక్కుల్ని తెచ్చిపెట్టాయి. దీంతో ఈ ఖాతా తీసేయాలంటూ ఓ స్నేహితుడిని కోరగా అతడూ అవకాశంగా తీసుకున్నాడు. వెరసి విషయం ఆమె భర్తకు తెలియడంతో సైబర్‌ క్రైమ్‌ అధికారులకు ఫిర్యాదు వెళ్లింది. దర్యాప్తు చేసిన అధికారులు కొందరిని రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు. టోలిచౌక్‌కు చెందిన ఓ వ్యక్తి దుబాయిలో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య నగరంలోనే ఉంటున్నారు.

ఆమెకు ఫేస్‌బుక్‌ ద్వారా జుబేర్‌గా చెప్పుకున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి పరిచయమయ్యాడు.  తరచూ చాటింగ్స్‌ చేసుకోవడంతో పాటు వ్యక్తిగత విషయాలు సైతం చర్చించుకునే స్థాయికి చేరారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కొన్ని అభ్యంతరకర అంశాలు చాటింగ్‌లో ప్రస్తావించుకున్నారు. వీటిని అడ్డం పెట్టుకున్న జుబేర్‌ సదరు మహిళను బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. నగ్న ఫొటోలు పంపించాలని అలా చేయకుంటే తమ మధ్య ఉన్న సంబంధాన్ని ఆమె భర్తకు చెబుతానంటూ బ్లాక్‌మెయిల్‌ చేయడంతో గత్యంతరం లేక ఆమె ఫొటోలు పంపించింది.

ఈ ఫొటోలను జుబేర్‌ మరో ఇద్దరికి షేర్‌ చేశాడు. వారిద్దరూ ఆమెకు పరిచయస్తులే కావడంతో వారూ ఫేస్‌బుక్‌ ద్వారా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. దీంతో ఫేస్‌బుక్‌ ఖాతాపై విరక్తి చెందిన ఆమె దాన్ని తొలగించాలని భావించింది. అయితే ఎలా చేయాలో ఆమెకు తెలియకపోవడంతో అందుకు సహకరించాల్సందిగా  సమీర్‌ఖాన్‌ అనే స్నేహితుడిని కోరింది. దానికోసం యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ పంపాల్సిందిగా అతడు కోరడంతో ఆమె అందించింది. వీటి ఆధారంగా సమీర్‌ ఆమె ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచి అందులో ఉన్న చాటింగ్స్, షేర్‌ చేసిన ఫొటోలను చూశాడు. వీటిని సమీర్‌ దుబాయిలో ఉన్న ఆమె భర్తకు పంపించాడు. అలా పంపుతూ సమీర్‌ తనకు ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, రూ.5 వేల నగదు వెంటనే అందించాలని, అలా కాకుంటే ఈ ఫొటోలను సోషల్‌మీడియాలో పెడతానంటూ ఆమె భర్తను బ్లాక్‌మెయిల్‌ చేశాడు.

భార్య నగ్న ఫొటోలను చూసిన అవాక్కైన భర్త హైదరాబాద్‌ వచ్చి భార్యను ఆరా తీశాడు. ఆమె ద్వారా విషయం బయటకు రావడంతో సిటీ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌పాషా దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి బాధితురాలిని బ్లాక్‌మెయిల్‌ చేసిన జుబేర్‌ సహా మరో ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు. బాధితురాలి భర్తకు ఫొటోలు పంపించిన సమీర్‌ను అదుపులోకి తీసుకున్నప్పటికీ అతడు నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగుడని తేలడంతో రిమాండ్‌కు తరలించలేదు. 

Advertisement
Advertisement