ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరం | Sakshi
Sakshi News home page

ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరం

Published Tue, Aug 20 2019 9:05 AM

RBI Former Governor Worried About Economy - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం పట్ల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్, బ్యాంకింగ్‌యేతర ఫైనాన్షియల్‌ రంగాల్లో సమస్యల తక్షణ పరిష్కారంపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రైవేటు రంగ పునరుత్తేజానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనీ సూచించారు. భారత్‌లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు లెక్కింపు విధానంపై తాజాగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వంలో చీఫ్‌ ఎకనమిస్ట్‌గా పనిచేసిన అరవింద్‌ సుబ్రమణ్యం జీడీపీ లెక్కలపై చేసిన విమర్శలనూ ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒక టీవీ చాన ల్‌కు  ఇచ్చిన ఇంటర్వ్యూలో  ముఖ్యాంశాలు...
భారత్‌ వృద్ధికి సంబంధించి ప్రైవేటు సంస్థల నుంచి వేర్వేరు అంచనాలు వెలువడ్డాయి. వాటిలో అధికభాగం అంచనాలు ప్రభుత్వ అంచనాలకన్నా తక్కువగా ఉన్నా యి. మొత్తంగా చూస్తే, ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉన్నట్లు భావిస్తున్నా.  
2018–19తో భారత్‌ ఆర్థిక వృద్ధి 6.8%. 2014–15 తరువాత ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి. ప్రభుత్వం 2019–2020లో 7 శాతం వృద్ధి అంచనావేస్తున్నా... అంతకన్నా తక్కువగానే ఉంటుందన్నది పలు ప్రైవేటు సంస్థల అంచనా.  
పలు వ్యాపారాల గురించి  ఆందోళన కలిగించే వార్తలే ఉంటున్నాయి. తమకు ఉద్దీపన చర్యలు ఏదో ఒక రూపంలో కావాలని పలు రంగాలు కోరుతున్నాయి.  
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రుణాలు నిజానికి సంస్కరణగా భావించకూడదు. ఇది వ్యూహాత్మక చర్య మాత్రమే.  
ప్రస్తుత వృద్ధికన్నా రెండు, మూడు శాతం అధిక వృద్ధి రేటు సాధన ఎలా అన్న అంశంపైనే మనం దృష్టి సారించాలి. దీనికి పలు రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్ల తక్షణ పరిష్కారం జరగాలి. విద్యుత్, నాన్‌ బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారం ఇందులో కీలకం.

Advertisement
Advertisement