బంధన్‌ చేతికి గృహ్‌ ఫైనాన్స్‌ | Sakshi
Sakshi News home page

బంధన్‌ చేతికి గృహ్‌ ఫైనాన్స్‌

Published Tue, Jan 8 2019 12:53 AM

Bandhan Bank acquires Gruh Finance – East meets west but focus to stay on bottom of pyramid - Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంక్‌ తాజాగా గృహ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు  ప్రకటించింది. షేర్ల మార్పిడి రూపంలో ఈ విలీన ఒప్పందం ఉండనుంది. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి జనవరి 1 నుంచి ఇది వర్తించనుంది.  ఇరు సంస్థల బోర్డులు సోమవారం ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేశాయి. రెండు పక్షాలకు ఇది ప్రయోజనకరమైన ఒప్పందంగా హెచ్‌డీఎఫ్‌సీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ వ్యాఖ్యానించారు. పెద్ద ఎత్తున కార్యకలాపాలు విస్తరించేందుకు గృహ్‌ ఫైనాన్స్‌కి, మరింత వైవిధ్యమైన సెక్యూర్డ్‌ రుణాల పోర్ట్‌ఫోలియో దక్కడం ద్వారా బంధన్‌ బ్యాంక్‌కు ఇది లాభించగలదన్నారు. విలీన సంస్థలో 15 శాతం దాకా వాటాలను అట్టే పెట్టుకునేందుకు అనుమతించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ను కోరతామని, అనుమతి లభించని పక్షంలో నిబంధనల ప్రకారం 10 శాతం లోపునకు తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. బ్యాంకు వృద్ధి ప్రణాళికల్లో భాగంగా డైవర్సిఫికేషన్‌పై దృష్టి పెట్టినట్లు, ఇందులో భాగంగానే గృహ్‌ ఫైనాన్స్‌ కొనుగోలు చేస్తున్నట్లు బంధన్‌ బ్యాంక్‌ సీఈవో చంద్ర శేఖర్‌ ఘోష్‌ తెలిపారు. విలీనానంతరం బంధన్‌ బ్యాంక్‌ పోర్ట్‌ఫోలియోలో అన్‌సెక్యూర్డ్‌ రుణాల వాటా 86 శాతం నుంచి 50 శాతానికి తగ్గుతుందన్నారు. విలీన బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 4,182 బ్యాంకింగ్‌ అవుట్‌లెట్స్, 476 ఏటీఎంలు ఉంటాయి. రుణ పోర్ట్‌ఫోలియోలో 58 శాతం మైక్రో ఫైనాన్స్‌ రుణాలు, 28 శాతం రిటైల్‌ హోమ్‌ లోన్స్, 14 శాతం ఇతరత్రా రుణాలు ఉంటాయి.

తగ్గనున్న బంధన్‌ హోల్డింగ్స్‌ వాటాలు .. ప్రస్తుతం బంధన్‌ బ్యాంక్‌లో మాతృ సంస్థ బంధన్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌కు (బీఎఫ్‌హెచ్‌ఎల్‌) 82.28 శాతం వాటాలు ఉన్నాయి. అటు గృహ్‌ ఫైనాన్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీకి 57.83% వాటాలు ఉన్నాయి. విలీనానంతరం బంధన్‌ బ్యాంక్‌లో బంధన్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ వాటా 60.27%కి తగ్గుతుంది. అటు హెచ్‌డీఎఫ్‌సీకి 15% వాటాలు దక్కుతాయి. ఆ తర్వాత కొన్ని వాటాలను పబ్లిక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు లేదా సెకండరీ మార్కెట్లలో విక్రయించడం ద్వారా దీన్ని క్రమంగా 10% లోపునకు తగ్గించుకుంటుంది. ఆర్‌బీఐ బ్యాంకింగ్‌ లైసెన్స్‌ నిబంధనల ప్రకారం.. కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్ల వ్యవధిలో బంధన్‌ బ్యాంక్‌లో బీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తన వాటాలు 82.3% నుంచి 40%కి తగ్గించుకోవాలి. కానీ అది జరగకపోవడంతో గతేడాది సెప్టెంబర్‌లో బంధన్‌ బ్యాంక్‌ కార్యకలాపాల విస్తరణ, సీఈవో చంద్రశేఖర్‌ ఘోష్‌ జీతభత్యాలపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించినప్పటికీ ఇటీవల సడలించింది. తాజా డీల్‌ పూర్తయినా బంధన్‌ బ్యాంక్‌లో బీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వాటా 60.27% స్థాయికి మాత్రమే తగ్గుతుంది. దీంతో.. వాటాలను మరింత తగ్గించుకోవడానికి బీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉండనుంది. ఇక, అటు హెచ్‌డీఎఫ్‌సీకి విలీన బ్యాంకులో ప్రమోటరు హోదా లభిస్తుంది.ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీకి.. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 19.72% వాటాలు ఉన్నాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ఒక బ్యాంకులో ప్రమోటరుగా ఉన్న సంస్థ మరో బ్యాంకులో ప్రమోటరుగా 10%కి మించి వాటాలు ఉండకూడదు దీంతో విలీన సంస్థలో ప్రారంభ దశలో 15.44% వాటాలు ఉన్నప్పటికీ.. హెచ్‌డీఎఫ్‌సీ కూడా క్రమంగా దీన్ని పది శాతం లోపునకు తగ్గించుకోవాల్సి రానుంది.  సోమవారం బీఎస్‌ఈలో బంధన్‌ బ్యాంక్‌ షేర్లు 5.21 శాతం క్షీణించి రూ. 501.10 వద్ద క్లోజయ్యాయి. గృహ్‌ ఫైనాన్స్‌ షేరు 3.9 శాతం క్షీణించి రూ. 306.20 వద్ద క్లోజయ్యింది. 

గృహ్‌ ఫైనాన్స్‌.. 
అల్పాదాయ వర్గాలకు గృహ రుణాలు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో 1986లో ఆగా ఖాన్‌ ఫౌండేషన్, హెచ్‌డీఎఫ్‌సీ కలిసి గృహ్‌ ఫైనాన్స్‌ ఏర్పాటు చేశాయి. సెప్టెంబర్‌ క్వార్టర్‌ గణాంకాల ప్రకారం.. గృహ్‌ ఫైనాన్స్‌ దాదాపు రూ. 2,738 కోట్ల రుణాలు ఇచ్చింది. మొత్తం లోన్‌ బుక్‌ పరిమాణం రూ. 16,663 కోట్లుగా ఉంది. ప్రధానంగా రిటైల్‌ విభాగంపై దృష్టి పెడుతున్న గృహ్‌ ఫైనాన్స్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రూ. 220 కోట్ల నికర లాభం ఆర్జించింది.

బంధన్‌ బ్యాంక్‌.. 
బంధన్‌ బ్యాంక్‌కు.. 938 శాఖలు, 30,431 మంది ఉద్యోగులు ఉన్నారు. మొత్తం డిపాజిట్లు రూ. 33,869 కోట్లు, ఇచ్చిన రుణాలు రూ. 33,373 కోట్లుగా ఉన్నాయి. బంధన్‌ బ్యాంక్‌ ప్రధానంగా తూర్పు భారతదేశ రాష్ట్రాల్లోని గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. రుణాల పోర్ట్‌ఫోలియోలో ఎక్కువగా మైక్రోఫైనాన్స్‌ లోన్సే ఉన్నాయి. అటు గృహ్‌ ఫైనాన్స్‌ పశ్చిమాది రాష్ట్రాల్లో .. గృహ రుణాల కేటగిరీలో కార్యకలాపాలు సాగిస్తోంది.

షేర్ల మార్పిడి ఇలా.. 
డీల్‌ ప్రకారం..  గృహ్‌ ఫైనాన్స్‌ షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి 1,000 షేర్లకు గాను బంధన్‌ బ్యాంక్‌కి చెందిన 568 షేర్లు లభిస్తాయి. ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా ప్రమోటర్‌ హోల్డింగ్‌ను తగ్గించుకోవడానికి, అలాగే హౌసింగ్‌ ఫైనాన్స్‌ పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించుకోవడానికి బంధన్‌ బ్యాంక్‌కు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. విలీన సంస్థ విలువ సుమారు రూ. 83,000 కోట్లుగా ఉంటుంది. బంధన్‌ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ. 59,800 కోట్లుగా ఉండగా, గృహ్‌ ఫైనాన్స్‌ విలువ రు. 23,224 కోట్లుగా ఉంది. 

Advertisement
Advertisement