వైఎస్‌ జగన్‌ గృహ ప్రవేశం | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ గృహ ప్రవేశం

Published Thu, Feb 28 2019 4:28 AM

YS Jagan House Warming Ceremony in Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నేతల కోలాహలం మధ్య వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న నూతన నివాసంలో గృహ ప్రవేశం చేశారు. ఉదయం 8.18 గంటలకు తన సతీమణి వైఎస్‌ భారతి, చిన్న కుమార్తె, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో జగన్‌ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారు. రోజంతా ఆయన అక్కడే గడిపారు.  

పార్టీ కేంద్ర కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు
అనంతరం 11 గంటల ప్రాంతంలో వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ సీపీ నూతన కేంద్ర కార్యాలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా సర్వ మత ప్రార్థనలు జరిగాయి. వేద పండితులు పూజలు నిర్వహించి జగన్‌ను ఆశీర్వదించారు. జగన్‌కు అంతా మంచి జరగాలని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆశయం సిద్ధించాలని ముస్లిం మత పెద్దలు దువా చేశారు. క్రైస్తవ పాస్టర్లు జగన్‌ కోసం ప్రత్యేకంగా పార్థనలు చేసి శుభాశీస్సులు పలికారు. వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితోపాటు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, పార్టీ కోఆర్డినేటర్లు, రాష్ట్ర స్థాయి నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పూజలు చేస్తున్న వైఎస్‌ జగన్‌. చిత్రంలో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు 

కిక్కిరిసిన కార్యాలయం
వైఎస్‌ జగన్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలోకి ప్రవేశించేటప్పటికే హాలు, ప్రాంగణం కార్యకర్తలు, నేతలతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జగన్‌ నివాళులర్పించారు. అంతకు ముందు కార్యాలయ ప్రాంగణంలో వైఎస్సార్‌ సీపీ పతాకాన్ని జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం నేతలందరినీ ఆప్యాయంగా పలుకరించి కలుసుకున్నారు. 
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద కార్యకర్తలకు అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌ 

కిటకిటలాడిన తాడేపల్లి 
వైఎస్‌ జగన్‌ గృహ ప్రవేశం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో తాడేపల్లి ప్రాంతం ట్రాఫిక్‌తో కిటకిటలాడింది. వేలాది మంది వచ్చినా ఎలాంటి లోటు లేకుండా అందరికీ భోజన సదుపాయం కల్పించారు. 

దగ్గుబాటి తనయుడు, ఆమంచి పార్టీలో చేరిక
తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన రోజే ముందుగా నిర్ణయించిన ప్రకారం మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయవేత్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన తనయుడు దగ్గుబాటి హితేష్‌ను తోడ్కొని వచ్చి వైఎస్‌ జగన్‌కు పరిచయం చేసి పార్టీలో చేర్పించారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కూడా ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీలో చేరారు. చీరాల, కారంచేడు, పర్చూరు నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన వేలాది మంది వీరి చేరికకు మద్దతు ప్రకటించారు. ‘జై జగన్‌...’ వైఎస్సార్‌సీపీ జిందాబాద్, జై దగ్గుబాటి, జై ఆమంచి..’ నినాదాల నడుమ వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దగ్గుబాటి హితేష్‌కు పార్టీ కండువాను కప్పి జగన్‌ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అనంతరం ఆమంచి కృష్ణమోహన్‌కు కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఎంపీ వి.విజయసాయిరెడ్డి, ఇతర నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Advertisement
Advertisement