Sakshi News home page

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు

Published Wed, Mar 25 2015 2:58 AM

Special status to Andhrula

యూనివర్సిటీ క్యాంపస్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని సినీనటుడు శివాజీ పేర్కొన్నారు. ఎస్వీయూ సెనేట్ హాల్‌లో మంగళవారం రాత్రి ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు అనే అంశంపై చర్చావేదిక నిర్వహించారు. ఈ చర్చా వేదికలో శివాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలపై మాట తప్పవద్దని, ఆంధ్రులను ముంచవద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో పౌరసమాజం కీలక పాత్ర పోషించాలని, విద్యార్థులు, ఎన్‌జీవోలు ప్రభుత్వాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన వారిని ఎదిరించాలని పిలుపునిచ్చారు.

అడ్డగోలు విభజనతో రాయలసీమ, ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. యువత ఉపాధి లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారని చెప్పారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా రాకపోతే రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షన్ మొదలైయ్యే అవకాశముందన్నారు. ఎంతో ఘన చరిత్ర కల్గిన ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కోరారు. ప్రత్యేక హోదా కోసం పార్టీలకతీతంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. మన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక హోదాపై ప్రశ్నించడం లేదన్నారు. మనమే ప్రశ్నించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.

ఎస్వీయూ ప్రొఫెసర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ నవ్యాంధ్ర ప్రదేశ్‌లో కేవలం రెండు జిల్లాలు అభివృద్ధికి పరిమితం అవుతున్నాయని, దీని వల్ల రాబోయే రోజుల్లో మళ్లీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పరిపాలన, అభివృద్ధి రాష్ట్రమంతా జరిగే చర్యలు తీసుకోవాలన్నారు. సీపీఎం నాయకులు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతలు తీసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రైతు నాయకుడు ఆదికేశవులురెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా పేరుతో బీజేపీ రాష్ట్ర ప్రజలను మోసగిస్తోందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి, జై సమైక్యాంధ్ర పార్టీ నాయకుడు నవీన్‌కుమార్‌రెడ్డి, విద్యార్థి నాయకులు నగేష్, క్షేత్రపాల్, రాజశేఖర్‌రెడ్డి, సప్తగిరి ప్రసాద్, ఓబుల్‌రెడ్డి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement