మా గుండెల్లో 'ఉండి'పోవా.. | Sakshi
Sakshi News home page

మా గుండెల్లో 'ఉండి'పోవా..

Published Sat, May 26 2018 7:35 AM

People Support TO YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

పేదల్లో పేదవై..  మాలో ఒకడివై..జన క్షేమమే ధ్యేయమై.. విశ్వసనీయతే ఆయుధమై..ఈ ‘దారి’ సాగిపోవా.. మా గుండెల్లో ఎటులైనా ఉండిపోవా.. అంటూ వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు జేజేలు పలికారు. ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర శుక్రవారం ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలో దిగ్విజయంగా ముగిసింది. మండుటెండనూ లెక్కచేయక ప్రజలు దారి పొడవునా జననేత కోసం నిరీక్షించారు. ఆయనను కలిసి కష్టాలు విన్నవించారు.మాట తప్పని నేత వెంట అడుగులేశారు. మా గుండెల్లో ‘ఉండి’పో అంటూ ప్రేమాభిమానాలు కురిపించారు.        

సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర శుక్రవారం ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలో దిగ్విజయంగా సాగింది. అడుగడుగునా జనాభిమానం ఉప్పొంగింది. జననేతకు జేజేలు పలికింది. ‘మా గుండెల్లో ఉండిపో’ అన్నా అంటూ నినదించింది.

యాత్ర సాగిందిలా..
శుక్రవారం ఉదయం జననేత పాదయాత్ర ఆకివీడు మండలం పెదకాపరంలో ప్రారంభమైంది. చినకాపవరం, గుమ్ములూరు, తరటావ, కోళ్లపర్రు మీదుగా ఆకివీడు చేరింది. ఆకివీడులో బహిరంగసభకు ప్రజలు పోటెత్తారు. అనంతరం అజ్జమూరు వరకూ యాత్ర సాగింది.

ఆకివీడు సభ జయప్రదం
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆకివీడులో  జరిగిన బహిరంగ సభ జయప్రదమైంది. ఈ సభలో వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అశేషజనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. దేవుని దయవల్ల వచ్చే ఎన్నికల్లో మనందరి ప్రభుత్వం వస్తే బ్రిటిష్‌వారిని ఎదిరించి తూటాలకు గుండె చూపించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును జిల్లాకు పెడతానని  ప్రకటించారు. అంతకుముందు పాదయాత్ర పొడవునా.. ప్రజలు తన ముందు ఉంచిన సమస్యలకు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. వారికి భరోసా ఇచ్చారు. ప్రజలను అష్టకష్టాలపాల్జేస్తున్న సర్కారుపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఉండి ఎమ్మెల్యే శివరామరాజు ప్రజల సమస్యలు తీర్చడంలో తీవ్రంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు.

తాగునీటి కష్టాలపైచలించిన జననేత
నియోజకవర్గంలో తాగునీరు కలుషి తమైందని, రక్షిత నీటి కోసం ప్రజలు నెలకు రూ.600 నుంచి రూ.700 వరకూ ఖర్చుపెట్టాల్సిన దుస్థితి నెలకొందని తెలియడంతో జననేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  రంగుమారిపోయి చెరుకురసంలా ఉన్న నీటిని చూసి చలించిపోయారు. ఇంత దారుణ పరిస్థితి ఉన్నా.. ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టకపోవడంపై జగనన్న మండిపడ్డారు.  దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పాదయాత్రగా ఈ ప్రాంతానికి రాకపోయినా ఇక్కడి ప్రజలు ఇచ్చిన వినతిపత్రంపై స్పందించి ప్రభుత్వంలోకి రాగానే రూ.30 కోట్లతో పైపులైన్‌ పనులను ప్రారంభిస్తే.. ఇప్పటి వరకూ పూర్తి చేయలేని తెలుగుదేశం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాంతంలో తాగునీటి దుస్థితి తలెత్తిందని జననేత విమర్శించారు.

ఎమ్మెల్యేకు 350 ఎకరాలా!
పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వని ప్రభుత్వం ఉండి ఎమ్మెల్యేకు ఏలూరు పక్కన 350 ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెట్టడం వెనుక మతలబు ఏమిటని, ఏ స్థాయిలో ముడుపులు ముట్టాయని జననేత ప్రశ్నించారు. ఉండి, ఆకివీడులలో విలువైన చెరువులను పూడ్చి వేసి అక్కడ మల్టిప్లెక్స్‌లు నిర్మించాలని ఎమ్మెల్యే చూడడాన్ని జగన్‌ తప్పుపట్టారు.

వినతుల వెల్లువ
ఉదయం నుంచి జరిగిన పాదయాత్రలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి వినతులు వెల్లువెత్తాయి. చిన కాపవరానికి చెందిన విస్సాకోటి చినబాబు అనే దివ్యాంగుడు తనకు ఉపాధి లేకపోవడం వల్ల కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. చినకాపవరంలో వెయ్యి మందికిపైగా క్రైస్తవులు ఉన్నా.. తమకు శ్మశాన వాటిక లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆ వర్గం వారు మొరపెట్టుకున్నారు.  ఉద్యోగ సంఘాల నేతలు  సీపీఎస్‌ రద్దు చేయాలంటూ వినతిపత్రం ఇచ్చారు. కోళ్లపర్రు గ్రామానికి చెందిన మహిళలు మురుగునీరు తాగాల్సి వస్తోందని, బిందెలతో నీరు తీసుకువచ్చి జననేతకు చూపించారు. వైద్య, ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఏఎన్‌ఎంలుగా పనిచేసున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, సర్వేల పేరుతో అదనపు పనిభారం మోపుతున్నారని సిబ్బంది జగన్‌కు మొరపెట్టుకున్నారు. అన్ని అర్హతలూ ఉన్నా తనకు రుణమాఫీ కాలేదని,   గ్రామంలోని జన్మభూమి కమిటీ సభ్యులను కలిస్తేనే రుణమాఫీ అవుతుందని అధికారులు చెబుతున్నారని పెదకాపవరం గ్రామానికి చెందిన కఠారి కనకదుర్గ ఆవేదన వ్యక్తం చేశారు.

తరలివచ్చిన పార్టీ శ్రేణులు
ఈ పాదయాత్రలో పార్టీ జిల్లా పరిశీలకులు వైవీ సుబ్బారెడ్డి, నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ వంక రవీంద్ర, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ కోటగిరి శ్రీధర్,  ఉండి నియోజకవర్గ కన్వీనర్‌ పీవీఎల్‌ నర్సింహరాజు, ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్‌ పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, గాదిరాజు సుబ్బరాజు, మంతెన బాబు, మేడిది జాన్సన్, గూడూరి ఉమాబాల, కమ్మ శివరామకష్ణ, అల్లూరి వెంకటరాజు, ఏడిద వెంకటేశ్వరరావు, మేకా శివపార్వతి తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రలో విజయనగరం మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు పార్టీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement