అధికార పార్టీ తీరుతో అన్యాయం! | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ తీరుతో అన్యాయం!

Published Mon, Dec 17 2018 8:03 AM

People Sharing Their Problems to YS jagan - Sakshi

శ్రీకాకుళం :అధికార పార్టీ తీరుతో అడుగడుగునా అన్యాయమైపోతున్నామని వివిధ వర్గాల వారు ప్రతిపక్ష నేత ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్నికల ముందు అనేక ప్రగల్భాలు పలికిన టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక ముఖం చాటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఆదివారం జరిగిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పలు సమస్యలు విన్నవించారు.–ప్రజాసంకల్పయాత్ర బృందం

 భూకబ్జాకు ప్రయత్నిస్తున్నారు
నాకున్న రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నా. దీనిని కబ్జా చేసేందుకు స్థానిక టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఒంటరి మహిళ కావడంతో నిత్యం నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఓసారి చంపేస్తామని కూడా బెదిరించారు. దీంతో పోలీసులను ఆశ్రయించా. అయినా ఫలితం లేదు. ఆదుకోవాలి బాబు.– గొర్లె సుందరమ్మ, గుండువిల్లి పేట, నరసన్నపేట నియోజకవర్గం

మద్దతు ధర ఏదీ?
వ్యవసాయం భారంగా మారింది. మదుపులు పెరిగిపోతున్నాయి. ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పంటకు మద్ధతు ధర రావడం లేదు. రుణాలు అందక రైతులు ప్రైవేటు  వ్యాపారుల వద్ద అప్పులు చేసి పండిస్తున్నారు. ప్రకృ తి విలయాల కారణంగా పంటలు నష్టపోతున్నాం. వడ్డీ వ్యాపారులు పండిన ఆ కాస్త పంటను అప్పుకు జమ చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని లాభసాటిగా ఉండేలా చూడలాయ్య..       – పి.సుధాకరరెడ్డి, ఒంగోలు

సీపీఎస్‌ ఉద్యోగులకు న్యాయం చేయండి..
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న 1.86 లక్షల మంది ఉద్యోగులకు న్యాయం చేయండి. మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం(సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి. 2005 నవంబర్‌ 1 నుంచి సీపీఎస్‌ అమలు కావడంతో ఉద్యోగులంతా ఆర్థిక భద్రత కోల్పోయారు. మా హక్కులు కోసం పోరాటం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల్ని అక్రమ అరెస్ట్‌లు చేయిస్తోంది.– కె.ప్రకాష్, ఏపీసీపీఎస్‌యూఎస్‌ కార్యదర్శి

మీరే సీఎం కావాలి..
వైఎస్‌ కుటుంబం అంటే నాకు కొండంత ఇష్టం. మహానేత మరణం తర్వాత ఇడుపులపాయకు కాలినడకన వచ్చాను. ఇచ్ఛాపురంలో ప్రజాప్రస్థాన విజయవాటికలో పదేళ్లు నుంచి స్వచ్ఛందంగా పరిశుభ్రత కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు ముఖ్యమంత్రి కావాలని నా గుండెపై జగన్‌ పేరుతో పచ్చబొట్టు వేసుకున్నాను. మీరు సీఎం కావాలయ్యా..– తుంగాన మాధవరావు, ఇచ్ఛాపురం

Advertisement
Advertisement