జగన్‌ హామీలను తిప్పికొట్టండి | Sakshi
Sakshi News home page

జగన్‌ హామీలను తిప్పికొట్టండి

Published Tue, Jul 11 2017 2:58 AM

జగన్‌ హామీలను తిప్పికొట్టండి - Sakshi

స్పీడు పెంచి, ఎదురు దాడి చేయాలని నేతలకు సలహా
 
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన తొమ్మిది హామీలు జనంలోకి విస్తృతంగా వెళ్లిన నేపథ్యంలో వాటిని నీరుగార్చేలా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపీలు, మంత్రులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ, జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు, పాదయాత్ర ప్రకటన తదితరాలపై విస్తృత చర్చ జరిగినట్లు తెలిసింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినా, చాలా వరకు వైఎస్సార్‌సీపీ అంశాలపైనే విశ్లేషణ సాగిందని సమాచారం. వాళ్లు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమయ్యారని, అందుకే రెండేళ్ల ముందే జగన్‌ హామీలు ప్రకటించారని, ఈ పరిస్థితిని దీటుగా ఎదుర్కోవాలని, మనం కూడా స్పీడు పెంచాల్సి వుందని పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. 
 
భయపడాల్సిన పనిలేదు: టీడీపీ పథకాల వల్ల లబ్ధి పొందిన వారు సంతోషంగా ఉన్నట్లు సర్వే నివేదికల్లో తేలినందున మనం భయ పడాల్సిన పని లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మూడేళ్లలో మనం ఏమీ చేయలేదనే ప్రచారాన్ని అన్ని స్థాయిల్లోనూ తిప్పికొట్టాలని, శాఖల వారీగా ఏం చేశాం, ఎంత నిధులు ఖర్చు చేశాం, ఎంతమందికి లబ్ది చేకూర్చామనే విషయాలను కూడా జనానికి వివరించాలని ఆయన సూచించినట్లు సమాచారం.  

Advertisement

తప్పక చదవండి

Advertisement