క్రమశిక్షణ తప్పితే శిక్షే | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణ తప్పితే శిక్షే

Published Mon, Mar 23 2020 5:07 AM

Case in Machilipatnam for false posting on social media - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో మన ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను కాదని ఈ వ్యాధి సోకిన వ్యక్తి దాని వ్యాప్తికి పాల్పడినా, కోవిడ్‌ సోకిన విషయాన్ని దాచినా, వైద్యానికి నిరాకరించినా కేసులు పెట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మీడియా సైతం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తప్పుడు సమాచారంతో ప్రజలను భయాందోళనలకు గురిచేయడం తగదని, తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మీడియా సంస్థలకు తేల్చి చెప్పింది.  

తప్పుడు పోస్టింగ్‌పై కేసు 
ఆరు నెలల కిందట అమెరికా నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నానికి వచ్చిన ఓ ప్రముఖ వైద్యుడి కుమారుడు రెండు రోజుల కిందట కోవిడ్‌తో చనిపోయాడంటూ ఒక వ్యక్తి తాజాగా సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌ పెట్టాడు. ఈ విషయాన్ని పలువురు వైద్యుడి దృష్టికి తేవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆదేశాలతో చిలకలపూడి సీఐ వెంకట నారాయణ కేసు నమోదు చేశారు. 

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు.. 
ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బంది, పౌరులపై ఐపీసీ 188 సెక్షన్‌ ప్రయోగిస్తారు. ఇందుకు జరిమానా ఉంటుంది. మరొకరి జీవితానికి ప్రమాదకరమని తెలిసినా అంటు వ్యాధిని దాచిపెట్టే ప్రయత్నం చేయడం, ఇతరుల సంక్రమణకు కారకులవడం, వైద్య సేవలకు నిరాకరించడం, నిర్భందాన్ని కాదని ఆంక్షలను ఉల్లంఘించడం వంటి నేరాలకు ఐపీసీ 269, 270, 271 సెక్షన్లపై కేసు నమోదు చేస్తారు. ఇందుకు ఆరు నెలల నుంచి రెండేళ్లకుపైగా జైలు శిక్ష తప్పదు. నగదు జరిమానా కూడా ఉంటుంది. 

కఠినంగా ఉంటాం: డీజీపీ
రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. దానిలో భాగంగానే చట్టపరంగా కేసుల నమోదుకు కూడా వెనుకాడేది లేదు.  
- విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా కోవిడ్‌ లక్షణాలు బయట పడుతున్నాయి. అలాంటి వారు విధిగా వైద్య ఆరోగ్య శాఖకు సమాచారమివ్వాలి. అందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పూర్తిగా సహకారం అందించాలి. 
- వైద్య, ఆరోగ్య సిబ్బంది వారిచ్చే సూచనల ప్రకారం విధిగా ఇంట్లో ఉండాలి. హోం ఐసోలేషన్‌ పాటించాలి. దీనివల్ల మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా, మీ చుట్టూ ఉన్నవారిని, మీ కుటుంబ సభ్యులను కాపాడుకున్న వారు అవుతారనే విషయాన్ని గుర్తించి సహకరించాలి. అలా కాకుండా బయట తిరగడం వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. 
- విదేశాల నుంచి వచ్చేవారు గోప్యత పాటించి ఇంట్లో/హోం ఐసోలేషన్‌ పాటించకపోవడం, సమాచారాన్ని దాచిపెట్టడం, వైద్య ఆరోగ్య సూచనలు పాటించకపోవడం చట్టరీత్యా నేరం. వారిపై చర్యలు తీసుకుంటాం. 
- ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలకు వెనుకాడం. 
- విదేశాల నుండి వచ్చినవారు విధిగా నిబంధనలు, సూచనలు పాటిస్తున్నారా లేదా? అన్నదానిపై సం బంధిత పోలీస్‌స్టేషన్‌ వారు కూడా దృష్టిపెడతారు. అలాంటి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీసులు తమ వంతు సహకారాన్ని అందిస్తారు.  

Advertisement
Advertisement