Sakshi News home page

8కేజీల గంజాయితో ముగ్గురి అరెస్టు

Published Wed, Apr 17 2024 1:15 AM

-

పార్వతీపురంటౌన్‌: 8 కేజీల గంజాయితో పట్టుబడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పార్వతీపురం పట్టణ సీఐ కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన పార్వతీపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ పార్వతీపురం పట్టణంలోని చినమాదిగ వీధి ప్రాంతంలో నివాసం ఉంటున్న నిడగంటి జ్యోతి గంజాయి విక్రయాలు జరుపుతోందన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. ఆమె నివాసం వద్ద ఈ సందర్భంగా 8కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి సరఫరా చేస్తున్న నక్కా వెంకటేష్‌, ఆమె వద్ద ఉంటున్న సహాయకుడు రోహిత్‌లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ దాడుల్లో ఎస్సై సంతోషి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

విజయనగరంలో మరో ఎనిమిది కిలోలు

విజయనగరం క్రైమ్‌: స్థానిక రైల్వేస్టేషన్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఎనిమిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ బి.వెంకటరావు మంగళవారం తెలిపారు. రైల్వేస్టేషన్‌ ఆవరణలో తనిఖీలు చేపడుతున్న ఎస్సై హరిబాబునాయుడు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వారి దగ్గర గంజాయి స్వాధీనం చేసుకుని డిప్యూటీ తహసీల్దార్‌ సమక్షంలో సీజ్‌ చేశారు. గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్రకు చెందిన పింటూ అంబుదాస్‌ పిండేను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మరో నిందితుడు జువైనల్‌ అని సీఐ చెప్పారు.

రైల్వే స్టేషన్‌లో 33 కిలోల గంజాయి

విజయనగరం క్రైమ్‌: స్థానిక రైల్వేస్టేషన్‌లో రైళ్ల తనిఖీలు ముమ్మరంగా చేస్తున్న జీఆర్‌పీ పోలీసులు మంగళవారం రూ.లక్షా 65వేల విలువైన 33 కిలోల గంజాయిని పట్టుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు రైల్వే లైన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకటరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రైల్వేస్టేషన్‌ ఫ్లాట్‌ఫామ్‌ నంబర్‌–1లో మహారాష్ట్రకు చెందిన శశికాంత్‌ చంద్రకాంత్‌ థోరట్‌, ఒడిశాకు చెందిన పాదలమ్‌ఖారాలు జైపూర్‌ నుంచి విజయనగరం బస్‌లో చేరుకుని విజయనగరం నుంచి విశాఖ, అక్కడ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని రవాణాచేయడానికి సిద్ధమయ్యారు. జీఆర్‌పీ సిబ్బంది తనిఖీల్లో భాగంగా రైల్వేస్టేషన్‌లో వారి దగ్గర గంజాయి ఉన్నట్లు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, కొత్తవలస, అరకు రైల్వేస్టేషన్‌ పరిధిలో తనిఖీలు ముమ్మరం చేసినట్లు లైన్స్‌ సీఐ వెంకటరావు తెలిపారు. ఎస్సై రవివర్మ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement