[Telangana Health Department Guidelines To Open Schools- Sakshi
Sakshi News home page

Schools Reopen In Telangana 2021 విద్యాసంస్థల రీ ఓపెనింగ్‌.. సూచనలు ఇవే

Published Thu, Aug 12 2021 1:55 AM

Telangana Health Department Suggested To Open Schools - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యా సంస్థలన్నీ తెరిచేందుకు, ప్రత్యక్ష బోధన నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ పచ్చజెండా ఊపింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినందున నిరభ్యంతరంగా పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోవచ్చని విద్యాశాఖకు సూచించింది. థర్డ్‌ వేవ్‌ ఇప్పట్లో వచ్చే పరిస్థితి కూడా లేదని స్పష్టం చేసింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ విద్యా సంస్థలు తెరవాలని సూచించింది. 

విద్యా సంస్థలు తెరిస్తే తప్పేముంది...
సినిమా హాళ్లకు అనుమతి ఇచ్చినప్పుడు విద్యా సంస్థలను తెరిస్తే తప్పేముందని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రాజకీయ నేతల యాత్రలు, భారీ సభలు, సమావేశాలు కొనసాగుతున్నాయని, వాటికి లేని నిబంధనలు స్కూళ్లకు వర్తింపజేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. కాగా, ఏడాదిన్నరగా స్కూళ్లు, కాలేజీలకు వెళ్లకపోవడం వల్ల విద్యార్థుల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ప్రమోషన్‌ విధానం నష్టం చేకూర్చుతుంది. ఇది విద్యార్థుల భవితవ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని స్కూళ్లు, కాలేజీలు తెరవాలని సూచించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

విద్యాశాఖ తర్జనభర్జనలు
విద్యా సంస్థలు తెరవడంపై వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై విద్యాశాఖ వర్గాలు తర్జన భర్జనలు పడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఈనెల 15 నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని నిర్ణయించాయి. పాఠశాలలు తెరవడమే మంచిదని పలువురు విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే కొందరు తల్లిదండ్రులు కూడా పాఠశాలలను కొన్ని జాగ్రత్తల నడుమ తెరవడమే మంచిదంటున్నారు. 9, 10 తరగతులకు ప్రత్యక్ష తరగతులు పెట్టి, మిగిలిన వారికి ఆన్‌లైన్‌¯ బోధన కొనసాగించాలన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

దూరదర్శన్, టీ–శాట్‌ పద్ధతుల్లో ఆన్‌లైన్‌ తరగతుల వల్ల విద్యార్థులకు ఎటువంటి ప్రయోజనమూ ఉండటంలేదన్న విమర్శలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో వర్చువల్‌ పద్ధతుల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారని, అయితే వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని అంటున్నారు. డిజిటల్‌ క్లాసుల ద్వారా విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ దీనిపై త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి: వైద్య, ఆరోగ్యశాఖ

  • ప్రతిరోజూ గదులు, కుర్చీలు, బెంచీలు, ఇత ర పరికరాలను శానిటైజ్‌ చేయాలి. చేతుల తో తాకే ప్రతి ప్రదేశాన్ని శానిటైజ్‌ చేయాలి.
  • మరుగుదొడ్లకు నీటి సదుపాయం కల్పిం చా లి. సబ్బులు అందుబాటులో ఉంచాలి. పారి శుధ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. 
  • విద్యార్థులకు కరోనా నెగెటివ్‌ రిపోర్టు తీసుకురావాలన్న నిబంధన విధించాలి. 
  • జలుబు, దగ్గు, జ్వరం ఉన్న విద్యార్థులను అనుమతించకూడదు.
  • విద్యార్థుల మధ్య భౌతికదూరం ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. 
  • అవసరమైతే రోజుకు రెండు బ్యాచ్‌లకు వేర్వేరుగా తరగతులు నిర్వహించాలి. లేకుంటే ఒక రోజు ఒక బ్యాచ్, మరుసటి రోజు ఇంకో బ్యాచ్‌కు తరగతులు నిర్వహించాలి. 
  • విద్యార్థులు, టీచర్లు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ప్రతి గది వద్ద శానిటైజర్‌ ఏర్పాటు చేయాలి. మాస్క్‌లను కూడా అందుబాటులో ఉంచాలి. 
  • హాస్టళ్లను ప్రత్యేక జాగ్రత్తల నడుమ తెరవాలి. విద్యార్థుల రూముల్లోకే భోజనం పంపించేలా ఏర్పాట్లు చేయాలి. అయితే అవకాశం ఉన్నవాళ్లు హాస్టళ్లకు తమ పిల్లలను పంపకుండా ఇంటినుంచే స్కూళ్లు లేదా కాలేజీలకు పంపించాలి. 

ఆన్‌లైన్‌ క్లాసులతో ప్రయోజనం లేదు 
కరోనా భయమైతే ఉంది. కానీ ప్రత్యక్ష తరగతులు లేక పిల్లలు చాలా నష్టపోతున్నారు. ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల వారికి అంతగా ప్రయోజనం ఉండటం లేదు. పైగా పాఠాల పేరుతో ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. అనుక్షణం వారిని కనిపెట్టుకుని ఉండాల్సి వస్తోంది. ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల్లో చురుకుదనం తగ్గిపోతోందేమో అని కూడా అన్పిస్తోంది.  
– స్వప్న కుమారి, పేరెంట్, హైదరాబాద్‌ 


విద్యాసంస్థలు ప్రారంభించాలి 
ఆన్‌లైన్‌ క్లాసులతో ఫలితం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. అదలా ఉంచితే మా అంచనా ప్రకారం 50 శాతం మం ది విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు అందడం లేదు. దీనివల్ల చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇకనైనా విద్యాసంస్థలు ప్రారంభించకపోతే పిల్లలపై మరింత తీవ్రమైన ప్రభావం పడే ప్రమాదం ఉంది. పాఠశాలల్లో పనిచేసే టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి వ్యాక్సిన్లు వేయించి, విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడటం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకొని పాఠశాలలు ప్రారంభించాలి. 
– ప్రవీణ్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఏబీవీపీ  

Advertisement
Advertisement