వరుణ బీభత్సం | Sakshi
Sakshi News home page

వరుణ బీభత్సం

Published Thu, Nov 23 2023 12:48 AM

ఈరోడ్‌లో పొంగి పొర్లుతున్న వాగు - Sakshi

ఈశాన్య రుతు పవనాలు పూర్తిగా విస్తరించడంతో రాష్ట్రంలో వరుణ బీభత్సం కొనసాగుతోంది. ఈ ప్రభావం దక్షిణ తమిళనాడు, డెల్టా, సముద్ర తీర జిల్లాలపై అత్యధికంగా ఉంది. మంగళవారం రాత్రంతా ఉత్తర చైన్నె, తిరుప్పూర్‌, తేని జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా ఉత్తర చైన్నె పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బుధవారం ఉదయాన్నే అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈక్రమంలో ఈనెల 26న దక్షిణ అండమాన్‌ సమీపంలోని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతారణకేంద్రం ప్రకటించింది. దీంతో వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.

సాక్షి, చైన్నె: రాష్ట్రంలోకి ఆలస్యంగా ప్రవేశించిన ఈశాన్య రుతు పవనాలు ప్రస్తుతం తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా గత మూడు రోజులుగా అనేక జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారి, తిరునల్వేలి, తేని, తిరుప్పూర్‌, ఈరోడ్‌లలో వరుణ ప్రభావం కనిపించింది. గత 24 గంటల్లో తిరుప్పూర్లో 17 సెం.మీ, అవినాశిలో 14 సెం.మీ వర్షం పడింది. దీంతో అక్కడి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అనేక ఇళ్లులోకి నీళ్లు ప్రవేశించడంతో ఉదయాన్నే అధికారుల సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తేని జిల్లాలోని పెరియకులంలో 6 సెం.మీ, బోడినాయకనూరులో 5 సెం.మీ వర్షం పడింది. ఇక్కడ వాగులు వంకలు, జలాశయాలు ఇప్పటికే పొంగిపొర్లుతున్నాయి. ఇక మైలాడుతురై, ఈరోడ్‌, నాగపట్నం జిల్లాలోనూ అనేక చోట్ల భారీ వర్షం పడింది. ఈరోడ్‌లో సేలం – కోయంబత్తూరు జాతీయ రహదారిలో ఓ చెరువు తెగడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాగపట్నంలోని వేదారణం, కోడియరైలో 3 సెం.మీ వర్షం పడింది. తూత్తుకుడి, విరుదునగర్‌లలోనూ అనేక చోట్ల భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఊటీ మార్గంలో కొండ చరియలు విరిగి పడటంతో టాయ్‌ రైలు సేవలను రద్దు చేశారు. తేనిలో వర్షాలకు కుంబకరై జలపాతం పొంగి పొర్లుతోండడంతో సందర్శకులపై నిషేధం విధించారు. మైలాడుతురైలో కురిసిన వర్షాలకు రోడ్డుపై నీరు చేరడంతో అదుపు తప్పిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. నాగపట్నం జిల్లా శీర్గాలి, తరంగంబాబు, కొల్లిడం పరిసరాలలో పంట పొలాలకు మళ్లీ వర్షపు నీరు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోడ్‌లో వర్షాలకు భవానీ సాగర్‌ జలాశయంలోకి సెకనుకు 4 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. 105 అడుగులతో కూడిన ఈ జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 75 అడుగులుగా ఉంది.

ఉత్తర చైన్నె పరిధిలో..

మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఉత్తర చైన్నె పరిధిలో అనేక చోట్ల వర్షం కురిసింది. ఫలితంగా తండయార్‌ పేట, తిరువీకానగర్‌, కొరుక్కు పేట పరిసరాలలోని లోతట్టు ప్రాంతాలలోకి వర్షపు నీరు చేరింది. మూల కొత్తలం వంతెన కింది భాగంలో నగర రవాణా సంస్థ బస్సు చిక్కుకుంది. కొర్కుపేట రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌పై నీరు చేరడంతో రైళ్లు నమ్మదిగా కదిలాయి. ఉత్తర చైన్నెతోపాటు మెరీనా తీరం పరిసరాలలోనూ కుండ పోతగా వర్షం పడింది. చైన్నె శివార్లలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల పరిధిలోని ప్రాంతాలలో తేలిక పాటి వర్షం పడింది. విమానాశ్రయం పరిసరాలలో భారీ వర్షం పడడంతో 22 విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని అనేక మార్గాలలో ఉదయాన్నే వాహన చోదకులకు తీవ్ర అవస్థలు తప్పలేదు. చైన్నెలో విద్యార్థులు తడుస్తూనే పాఠశాలలకు చేరుకున్నారు. చైన్నె రోడ్లపై చేరిన నీటిని తొలగించేందుకు ఆగమేఘాలపై కార్పొరేషన్‌ సిబ్బంది ఉదయాన్నే పనులు ప్రారంభించారు. 37కు పైగా ప్రాంతాలలో చేరిన వర్షపు నీటిని ఆగమేఘాలపై తొలగించారు.

జాలర్లకు హెచ్చరిక..

దక్షిణ అండమాన్‌ సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఈనెల 26న ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటించింది. ఈ ప్రభావంతో నీలగిరి, కోయంబత్తూరు, తేని, దిండుగల్‌ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లు ఒడ్డుకు తిరుగు పయనం కావాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతు పవనాల విస్తృతం వెరసి 20 జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం తదుపరి పరిణామాలతో మరిన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

20 జిల్లాల్లో

ఈశాన్య రుతు పవనాల ప్రభావం

ఉత్తర చైన్నె, తిరుప్పూర్‌, తేని,

కన్యాకుమారి, నైల్లె, తెన్‌కాశిలో

కుండపోత వర్షం

నీలగిరి, కోవై, తేని,

దిండుగల్‌లో రెడ్‌ అలర్ట్‌

చైన్నెలో 22 విమాన సేవలకు ఆటంకం

అండమాన్‌ సమీపంలో

26న అల్పపీడనం?

ఊటీ మార్గంలో నేలకొరిగిన కొండ చరియలు
1/10

ఊటీ మార్గంలో నేలకొరిగిన కొండ చరియలు

తండయార్‌ పేట మార్గంలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు
2/10

తండయార్‌ పేట మార్గంలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు

కొరుక్కుపేట రైల్వేస్టేషన్‌ ట్రాక్‌పై వర్షపు నీరు
3/10

కొరుక్కుపేట రైల్వేస్టేషన్‌ ట్రాక్‌పై వర్షపు నీరు

అన్నానగర్‌లో నేల కొరిగిన చెట్టును తొలగిస్తున్న సిబ్బంది
4/10

అన్నానగర్‌లో నేల కొరిగిన చెట్టును తొలగిస్తున్న సిబ్బంది

ఈరోడ్‌లో ఇంట్లోకి చేరిన నీటిని తొలగిస్తున్న మహిళలు
5/10

ఈరోడ్‌లో ఇంట్లోకి చేరిన నీటిని తొలగిస్తున్న మహిళలు

చైన్నెలో ఒడ్డుకే పరమితమైన పడవలు
6/10

చైన్నెలో ఒడ్డుకే పరమితమైన పడవలు

కోయంబేడు వద్ద రోడ్డుపై వరద నీరు
7/10

కోయంబేడు వద్ద రోడ్డుపై వరద నీరు

చెరువును తలపిస్తున్న లైట్‌హౌస్‌ పరిసరాలు
8/10

చెరువును తలపిస్తున్న లైట్‌హౌస్‌ పరిసరాలు

తండయార్‌ పేట వీఓసీ నగర్‌లో..
9/10

తండయార్‌ పేట వీఓసీ నగర్‌లో..

చైన్నెలో నీటిలో చిక్కుకున్న బస్సు
10/10

చైన్నెలో నీటిలో చిక్కుకున్న బస్సు

Advertisement
Advertisement