బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారు

- - Sakshi

నల్లగొండకు కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరికి క్యామ మల్లేష్‌

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్‌ స్థానాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నల్లగొండకు కంచర్ల

కృష్ణారెడ్డిని, భువనగిరికి క్యామ మల్లేష్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు కేసీఆర్‌ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. నల్లగొండలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు గుత్తా అమిత్‌రెడ్డి ముందు ఉత్సాహం చూపినా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన పోటీ చేయనని అధిష్టానానికి తెలియజేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డిని బరిలో నిలపాలని పార్టీ భావించినా ఆయన బీజేపీకి టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరగడంతో కంచర్ల కృష్ణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అయితే తాను బీజేపీలోకి వెళ్లడం లేదని, బీఆర్‌ఎస్‌లోనే ఉంటానని, ఎంపీగా పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చిన్నపరెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటించారు. కానీ, శనివారం నల్లగొండ పార్లమెంట్‌ అభ్యర్థి విషయమై నేతలతో చర్చించి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డిని అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఖరారు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించే వరకు ఆగితే ప్రచారానికి ఇబ్బంది అవుతుందని, క్షేత్ర స్థాయిలో ప్రచారం ముమ్మరంగా చేయాలంటే వెంటనే అభ్యర్థులను ప్రకటించాలని జిల్లా నేతలు పట్టుబట్టారు. దీంతో శనివారం అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది.

భువనగిరి అభ్యర్థిగా క్యామ మల్లేష్‌

నల్లగొండ పార్లమెంట్‌ స్థానాన్ని ఓసీకి ఇచ్చిన బీఆర్‌ఎస్‌ పార్టీ.. భువనగిరి స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి(కురుమ) చెందిన క్యామ మల్లేష్‌కు కేటాయించింది. భువనగిరి టికెట్‌ విషయంలో కూడా పార్టీ తర్జనభర్జన పడింది. క్యామ మల్లేష్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్‌ పేర్లను పరిశీలించింది. పైళ్ల శేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. అయితే, బీసీ వర్గానికి ఇవ్వాలని భావించిన పార్టీ.. క్యామ మల్లేష్‌, బూడిద భిక్షమయ్యగౌడ్‌ పేర్లను పరిశీలించింది. చివరకు క్యామ మల్లేష్‌ పేరును ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్‌ స్థానాలకు గాను రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించడంతో ఇన్నాళ్లుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

మొదటి నుంచి బీసీలకే..

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ భువనగిరి ఎంపీ టికెట్‌ను బీసీలకే కేటాయిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి 2014, 2019లో ఎంపీ టికెట్‌ బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ ఇచ్చారు. 2014లో గెలిచిన ఆయన 2019లో ఓడిపోయారు. ఈ సారి కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన క్యామ మల్లేష్‌కు ఇచ్చింది. క్యామ మల్లేష్‌ 2014లో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో కాంగ్రెస్‌ పార్టీ ఇబ్రహీంపట్నం టికెట్‌ ఇవ్వకపోవడంతో 2019లో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

భిక్షమయ్యగౌడ్‌, బాలకృష్ణారెడ్డికి నిరాశ

భువనగిరి ఎంపీ టికెట్‌ దాదాపు ఖరారు అయినట్లు భావించిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌కు అఽధిష్టానం మొండిచేయి చూపింది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బూర నర్సయ్యగౌడ్‌ బీఆర్‌ఎస్‌ను వీడడంతో బీజేపీలో ఉన్న భిక్షమయ్యగౌడ్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ ఆహ్వానించింది. ఆ సందర్భంగా అఽధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లు భిక్షమయ్యగౌడ్‌కు పదవుల హామీ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డికి కూడా నిరాశే ఎదురైంది. భువనగిరి ఎంపీ టికెట్‌ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు బాలకృష్ణారెడ్డిని కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న సమయంలో ఎంపీ టికెట్‌ ఇస్తామని అధినేత కేసీఆర్‌ హామీ ఇచ్చినా ఆయనకు టికెట్‌ దక్కలేదు.

ఫ రెండు పార్లమెంట్‌ స్థానాలకు

అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌

ఫ సరైన అభ్యర్థుల కోసం సుదీర్ఘ చర్చలు, సమాలోచనలు

ఫ కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెర

ఫ సామాజికవర్గాల వారీగా ఎంపిక

ఫ భువనగిరి టికెట్‌ మూడోసారి కూడా బీసీలకే..

పేరు: కంచర్ల కృష్ణారెడ్డి

తండ్రి: కంచర్ల మల్లారెడ్డి

భార్య: సులోచన

కుమారుడు: సమరసింహారెడ్డి

పుట్టిన తేదీ: 10.5.1970

గ్రామం: ఉరుమడ్ల, చిట్యాల మండలం

విద్యార్హత: ఎంఏ, ఎల్‌ఎల్‌బీ

వృత్తి: అడ్వకేట్‌ (1995– 2006)

రాజకీయం : బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిక అనంతరం హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌, మునుగోడు, నల్లగొండ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జిగా బాధ్యతలు

పేరు : క్యామ మల్లేష్‌

పుట్టిన తేదీ : 05.01.1965

చదువు : గ్రాడ్యుయేషన్‌

కుటుంబం : భార్య జంగమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు

స్వగ్రామం : శేరిగూడ, ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా

రాజకీయం : 1992 నుంచి 1994 వరకు ఇబ్రహీంపట్నం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గా, 2013 నుంచి 2018 వరకు రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, 2019 నుంచి బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు.

Election 2024

Read latest Suryapet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top