టమాట రేటు.. మిర్చి ఘాటు | Sakshi
Sakshi News home page

టమాట రేటు.. మిర్చి ఘాటు

Published Sat, May 25 2024 11:30 AM

టమాట

హిందూపురం అర్బన్‌: మార్కెట్‌లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. దీంతో జనం ఆచితూచి కొనాల్సి వస్తోంది. వేసవిలో జిల్లా వ్యాప్తంగా కూరగాయల దిగుబడి తగ్గడం వల్లే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

బెంగళూరు నుంచి దిగుమతి..

మామూలు రోజుల్లో జిల్లా నుంచే ఉద్యాన నగరి బెంగళూరుకు కూరగాయలు ఎగుమతి చేసేవారు. కానీ వేసవిలో పరిస్థితి తిరగబడింది. ప్రస్తుతం కూరగాయలన్నీ కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో పచ్చిమిర్చి 2 వేల హెక్టార్లు, టమాట 3 వేల హెక్టార్లలో రైతులు సాగు చేస్తున్నారు. కానీ ఎండల దెబ్బకు దిగుబడులు బాగా తగ్గిపోయాయి. మరోవైపు వినియోగం పెరిగింది. దీంతో జిల్లా వ్యాపారులు బెంగళూరు మార్కెట్‌పై ఆధారపడాల్సి వస్తోంది. బెంగళూరు, చిక్కబళాపుర, బాగేపల్లి మార్కెట్‌ల నుంచి నిత్యం మిర్చి, టమాట ఇతర కూరగాయలు 50 లోడ్లు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ సరుకు ఎక్కువగా కదిరి, ధర్మవరం, అనంతపురం, హిందూపురం మార్కెట్‌లకు చేరుతోంది.

అమాంతం పెరిగిన ధరలు..

మామూలు రోజుల్లో పచ్చి మిర్చి కిలో ధర రూ.25 నుంచి రూ.40 మధ్య ఉండేది. టమాట ధర కూడా కిలో రూ.15 నుంచి రూ.20 మధ్య ఉండేది. కానీ దిగుబడులు తగ్గి డిమాండ్‌ పెరగడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. వారంరోజుల క్రితం కిలో పచ్చి మిర్చి ధర రూ.70 ఉండగా, శుక్రవారం ఏకంగా రెండింతలు పెరిగి కిలో రూ.140కి చేరింది. ఇక టమాట గత వారం కిలో రూ.20 నుంచి రూ.22 పలుకగా, ఇప్పుడు ఏకంగా రూ.50కి చేరింది. మిగతా కూరగాయలు కూడా దాదాపుగా రెండింతల మేర పెరిగాయి. రానున్న రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

వేసవిలో తగ్గిన కూరగాయల దిగుబడి

ధరల పెరుగుదలతో సామాన్యులకు ఇబ్బందులు

టమాట రేటు.. మిర్చి ఘాటు
1/1

టమాట రేటు.. మిర్చి ఘాటు

Advertisement
 
Advertisement
 
Advertisement