Sakshi News home page

టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథిపై కేసు

Published Thu, Mar 28 2024 12:30 AM

- - Sakshi

పెనుకొండ: హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ అధికారులు కలెక్టరేట్‌కు పంపారు. బీకే పార్థసారథి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మంగళవారం తన స్వగృహంతో పాటు పార్టీ కార్యాలయంలో 300 నుంచి 400 మంది టీడీపీ కార్యకర్తలకు భోజన సౌకర్యం కల్పించారు. దీనిపై మంగళవారం రాత్రి మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసీసీ) అధికారి వంశీకృష్ణ భార్గవ్‌ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంటర్‌ ప్రవేశాలకు

దరఖాస్తుల ఆహ్వానం

పుట్టపర్తి: జిల్లాలోని 10 మోడల్‌ స్కూళ్లలో 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ మీనాక్షి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి మే 22వ తేదీ లోపు https:// apms. apcfss. in, www. cse. ap, gov. in వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయని, 10వ తరగతి మెరిట్‌, రిజర్వేషన్‌ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు రూ.150 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.

ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

పుట్టపర్తి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ముగిశాయి. ఈనెల 18న పరీక్షలు ప్రారంభం కాగా, బుధవారం జరిగిన సోషల్‌తో ప్రధాన పరీక్షలు ముగిశాయి. ఈనెల 28, 30 తేదీల్లో మైనర్‌ సబ్జెక్టుల పరీక్షలుంటాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 115 కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని, ఎక్కడా మాస్‌ కాపీయింగ్‌, పేపర్‌ లీక్‌కు ఘటనలకు తావులేకుండా విజయవంతంగా పరీక్షలు నిర్వహించినట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు. రోజు 95.5 శాతం హాజరు నమోదైందని, మొత్తంగా 26 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారని తెలిపారు. పరీక్షల నిర్వహణలో 1,250 ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించారని డీఈఓ వెల్లడించారు. ఇక చివరి రోజు బుధవారం జరిగిన సోషల్‌ పరీక్షకు 22,658 మంది విద్యార్థులకు గాను 21,822 మంది విద్యార్థులు హాజరయ్యారు. 836 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

Advertisement

What’s your opinion

Advertisement