Sakshi News home page

అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌

Published Mon, Apr 15 2024 12:30 AM

- - Sakshi

కొడవలూరు: క్రీడల్లో యువతను ప్రోత్సహించేందుకు గానూ నెల్లూరులో 150 ఎకరాల్లో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని యల్లాయపాళెంలో భారీ ర్యాలీని ఆదివారం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి పట్టంకట్టి.. ఎంపీగా తనను, కోవూరు ఎమ్మెల్యేగా ప్రసన్నకుమార్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఆర్నెల్లకోసారి జాబ్‌మేళాలను నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాదర్బార్‌ను ఏర్పాటు చేసి ప్రజల నుంచి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తామని చెప్పారు.

సీఎంపై దాడి హేయం

సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై రాళ్ల దాడి చేయడాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. జగన్‌మోహన్‌రెడ్డి అంతు చూస్తానని, రాళ్లతో కొట్టిస్తానని చంద్రబాబు బహిరంగంగా చెప్పారని, దీని బట్టి చూస్తే దాడి ఎవరి ప్రోద్బలంతో జరిగిందో అర్థమవుతోందని చెప్పారు. సంక్షేమ పథకాలు పొందిన వారు సోమరులవుతారని టీడీపీ అభ్యర్ధి ప్రశాంతిరెడ్డి వ్యాఖ్యానించడం దారుణమన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను రద్దు చేస్తారనే అంశాన్ని పరోక్షంగా ఆమె చెప్పారని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న నేత ప్రసన్నకుమార్‌రెడ్డి అని.. కొత్తగా డబ్బు సంచులతో వచ్చిన నేత ప్రశాంతిరెడ్డి అని విమర్శించారు. జాతీయ స్థాయిలో సమస్యలుంటే తాను.. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అయితే ప్రసన్న పరిష్కరిస్తారని చెప్పారు.

చంద్రబాబు తత్వాన్ని గ్రహించాలి

ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వ్యక్తిని పక్కనబెట్టి, డబ్బున్న వారికి కోవూరు సీటును కేటాయించిన చంద్రబాబు కుతంత్రాన్ని ప్రజలు గ్రహించాలని పార్టీ కోవూరు నియోజకవర్గ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోరారు. తాను ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలిచినా ఏనాడూ గర్వపడలేదన్నారు. ఎవరైనా తన ఇంటికి నేరుగా రావొచ్చని.. ఎవర్నైనా తన పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడతానని తెలిపారు. ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందితే ఆమెను కలిసేందుకు మూడు గేట్లు దాటాల్సి ఉంటుందని, అప్పటికీ సెక్యూరిటీ లోపలికి అనుమతిస్తారాననేది అనుమానమేనని పేర్కొన్నారు. ముస్లింకు నెల్లూరు సిటీ టికెట్‌ను ఇచ్చారనే కారణంతో పార్టీ మారిన వీపీఆర్‌ డబ్బుతో గెలవొచ్చని భ్రమపడ్డారని.. అయితే మంచి మనస్సున్న విజయసాయిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయనకు నిద్రపట్టడంలేదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో రాళ్లు వేయించడం నీచమైన చర్యగా అభివర్ణించారు. ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు, పార్టీ యువజన విభాగ నియోజకవర్గ అధ్యక్షుడు నల్లపరెడ్డి రజత్‌కుమార్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ గంధం వెంకటశేషయ్య, ఎంపీపీ జ్యోతి, విజయ డెయిరీ డైరెక్టర్‌ ఇసనాక సునీల్‌రెడ్డి, ఎంపీటీసీ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరులో 150 ఎకరాల్లో నిర్మిస్తాం

ఆర్నెల్లకోసారి జాబ్‌మేళాలు

వైఎస్సార్సీపీ నెల్లూరు లోక్‌సభ

అభ్యర్థి విజయసాయిరెడ్డి

Advertisement

తప్పక చదవండి

Advertisement