పైసలిస్తేనే అంత్యక్రియలు

సిరిసిల్లలో విద్యానగర్‌ వైకుంఠధామం - Sakshi

సిరిసిల్లటౌన్‌: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో పేదలు చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడం కష్టంగా మారింది. మున్సిపల్‌ వైకుంఠధామాల్లోని సిబ్బంది జబర్దస్త్‌గా వసూళ్లు చేస్తుండడంతో బాధిత కుటుంబాలకు ఇబ్బందిగా మారింది. ఆత్మీయులను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న వారిపై మానవత్వం చూపడం లేదు. వైకుంఠధామాలు లేని రోజులతో పోలిస్తే నేడు అంత్యక్రియల ఖర్చు నాలుగింతలు పెరగడం విమర్శలకు తావిస్తోంది.

మంట కలుస్తున్న ఆదర్శం

సిరిసిల్లలో గతంలో మానేరువాగులో అంత్యక్రియలు చేసేవారు. నిరుపేదలు ఎక్కువగా ఉండే సిరిసిల్లలో అద్దెకు ఉండేవారు చనిపోతే ఇంటి యజమానులు మృతదేహాలను ఇంట్లోకి రానీయకుండా అడ్డుకునేవారు. ఫలితంగా రోడ్డుపై శవాలను ఉంచేవారు. పోయిన వారికి ఖర్మకాండల నిర్వహణకు అనేక ఇబ్బందులు పడేవారు. ఇలాంటి సంఘటనలు 2017కు పూర్వం అనేకం. చావింట్లో నెలకొంటున్న అమానవీయ పరిస్థితులను అరికట్టేలా అప్పటి మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి రెండు మోడల్‌ గ్రే యార్డులు నిర్మించారు. ఆధునిక హంగులతో నిర్మించిన గ్రే యార్డుల్లో ఇప్పుడు సమస్యలు తిష్ట వేశాయి. అంతేకాకుండా అంత్యక్రియల నిర్వహణకు అధిక వసూళ్లు చేస్తుండడం బాధిత కుటుంబీకులపై భారంగా మారుతుంది.

సప‘రేటు’.. సమస్యలు తిష్ట

● నెహ్రూనగర్‌లో రూ.6వేలు, విద్యానగర్‌లో రూ.7,500 వసూళ్లు చేస్తున్నారు.

● వాస్తవానికి ఒకరికి అంత్యక్రియలు నిర్వహించేందుకు మున్సిపల్‌కు రూ.1,500 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

● రెండు వైకుంఠథామాల్లో నీటివసతి సరిగా లేదు.

● ప్రతిరోజు శుభ్రం చేయడం లేదు.

● అంత్యక్రియల కార్యక్రమాలతోనే ఉపాధి పొందే వారికి ప్రభుత్వం తరఫున కనీస వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

● కరీంనగర్‌ మున్సిపాలిటీ మాదిరిగా సిరిసిల్లలో కూడా అంత్యక్రియలకు ప్రత్యేక నిధులు కేటాయించాలనే డిమాండ్‌ ఉంది.

అంత్యక్రియల ఖర్చు ఇలా..(రూ.లలో)

సిరిసిల్లలో నిరుపేదలకు చావు కూడా భయానకమే.. అంతిమసంస్కారాల ఖర్చు కనీసం రూ.25వేలు ఆందోళనలో నిరుపేదలు సమస్య పరిష్కరించాలని డిమాండ్‌

‘సిరిసిల్లకు చెందిన ఓ అసిస్టెంట్‌ స్కీం వర్కర్‌ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. ప్రభుత్వం అంత్యక్రియల కోసం రూ.10వేల ఆర్థికసాయం అందింది. స్థానిక మున్సిపల్‌ వైకుంఠధామంలో అంత్యక్రియలు నిర్వహిస్తే రూ.15వేలకు పైగా ఖర్చు అయ్యింది. తమ దీనస్థితిని బాధిత కుటుంబం మొరపెట్టుకున్నా.. అక్కడ కనికరించే వారు లేరు.’

‘సిరిసిల్ల పట్టణ ప్రాంతానికి చెందిన ఓ రిౖటైర్డు ఉద్యోగి అనారోగ్యంతో మృతిచెందాడు. చికిత్స కోసం ఆస్పత్రిలోనే రూ.లక్షకు పైగా ఖర్చయ్యాయి. అదే బాధలో సొంతూరికి భౌతికకాయాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపిస్తే జబర్దస్త్‌గా వసూళ్లు చేశారు. అప్పుసప్పు చేసి దాదాపు రూ.20వేలు ఖర్చు చేస్తే గాని అంత్యక్రియలు పూర్తికాలేదు.’

మున్సిపల్‌ సుంకం 1500

కట్టెలు 4,000

డప్పులు 4,000

పాడెకట్టెలు 2,000

సుంకరి 4,000

కాటికాపరి 500

చాకలి 3,000

మంగలి 1,500

ఫ్రీజర్‌ 4,000

మొత్తం 24,500

రూ.4.70కోట్లతో వైకుంఠధామాలు

జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌, నెహ్రూనగర్‌లలో మోడల్‌ వైకుంఠథామాలను రూ.4.40కోట్లతో 2016లో నిర్మించారు. భౌతికకాయాల ఉచిత అంతిమయాత్ర కోసం రెండు వైకుంఠరథాలను ఏర్పాటు చేశారు. సంజీవయ్యనగర్‌లో రూ.10 లక్షలు వెచ్చించి మరో శ్మశానవాటికను నిర్మించారు. రగుడు ప్రాంతంలో రూ.20లక్షలతో ఎల్‌పీజీ గ్యాస్‌తో క్రెమటోరియమ్‌(యంత్రంతో దహన సంస్కారాలు నిర్వహించుట) ఏర్పాటు చేశారు.

చాలా సార్లు ఫిర్యాదు చేశాం

దహన సంస్కారాలకు అధికంగా వసూలు చేస్తున్నారని గతంలో చాలా సార్లు ఫిర్యాదు చేశాం. నిలువ నీడలేని నిరుపేదలు చనిపోయినా అధిక వసూళ్లు ఆగడం లేదు. కరీంనగర్‌ స్ఫూర్తితో సిరిసిల్లలో బల్దియానే అంత్యక్రియలను ఉచితంగా జరిపించాలి.

– బియ్యంకార్‌ శ్రీనివాస్‌, సామాజిక కార్యకర్త

అధిక వసూళ్లను నియంత్రించాలి

అంతిమసంస్కారాలలో జరుగుతున్న అధిక వసూళ్లను నియంత్రించాలి. కొద్ది రోజుల క్రితం నా భార్య చనిపోతే రూ.1,500 ఫీజు ఉందని నెహ్రూనగర్‌లో జరిపించాం. చనిపోయిన బాధలో ఉండే వారిపై మానవత్వం లేకుండా ప్రవర్తించడం సరికాదు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్యాకేజీ అమలు చేయాలి.

– చిప్ప దేవదాసు, స్థానికుడు

రూపాయి హామీ ఏమైంది ?

జనవరిలో మావార్డులో గడ్డం దేవయ్య అనే నిరుపేద చనిపోతే వైకుంఠ రథం కోసం అడిగితే డీజిల్‌కు పైసల్లేవన్నరు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశానవాటిక వరకు పాడెను ఎత్తుకుని పోయినం. సిరిసిల్లలో రూపాయికే దహన సంస్కారాలు నిర్వహించాలని గతంలో బీఆర్‌ఎస్‌ నేతలు ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయడం లేదు. గ్రే యార్డులో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది.

– బొల్గం నాగరాజుగౌడ్‌, పదోవార్డు కౌన్సిలర్‌

Election 2024

Read latest Rajanna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top