● ఓట్లలో ఘనం.. దక్కని సీట్లు ● కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌లోనూ పురుషులకే అవకాశం

- - Sakshi

సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో ‘ఆమె’ తీర్పు అతికీలకం కానుంది. పార్లమెంట్‌ పరిధిలోని ఆరు నియోజకవర్గాలను పరిశీలిస్తే.. అన్నిచోట్ల పురుషుల కంటే మహిళల ఓట్లే అధికంగా ఉన్నాయి. అభ్యర్థుల గెలుపోఓటముల్లో వీరి తీ ర్పే ప్రధాన భూమిక పోషించనుంది. అయితే, మ హిళలకు సీట్లు కేటాయించే విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదు. పురు ష అభ్యర్థులకే అవాశాలు కల్పిస్తున్నాయి. 33శాతం మహిళలకు రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బీజేపీ.. ఆ చట్టాన్ని వెంటనే అమల్లోకి తేవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుండగా.. మద్దతు ఇచ్చిన బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి లోక్‌సభ బరిలో నిలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టేందుకు మహిళలకు అవకాశం కల్పించలేదనే అపవాదు మూటగట్టుకుంది.

అందరూ పురుషులే..

● పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా అందరూ పురుషులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

● అసెంబ్లీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఆధారంగా పురుషులతో సమానంగా మహిళలు పోటీపడుతున్నారు.

● లోక్‌సభకు వచ్చేసరికి మహిళల ప్రాతినిధ్యం ఆశించిన స్థాయిలో కనిపించడంలేదు.

● 2019 ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి మొత్తం 17మంది పోటీలో నిలువగా అందులో ఇద్దరే మహిళలు ఉండడం గమనార్హం.

● 2014ఎన్నికల్లో సైతం 17మంది పోటీచేస్తే కేవలం ఒక్క మహిళా అభ్యర్థి బరిలో నిలిచారు.

● ప్రధాన పార్టీలు టికెట్లు ఇవ్వడానికి ఆసక్తి చూపకపోగా, ఇటు స్వతంత్రంగా పోటీచేసేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు.

● విస్తీర్ణ పరంగా పార్లమెంటు పెద్దగా ఉండడం ఒక కారణంగా చెప్పవచ్చు.

● అయితే పార్టీలు టికెట్లు ఇస్తే పోటీ చేసేందుకు చాలామంది హహిళలు ఆసక్తిగా ఉన్నారు.

ఒక్కరే మహిళా ఎంపీ

పార్లమెంట్‌ పరిధిలోని రామగుండం మినహా ఆరు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఎస్సీ రిజర్వుడ్‌ స్థానమైన పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కేవలం ఒక్క మహిలే ఎంపీగా గెలుపొంది పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన డాక్టర్‌ సుగుణకుమారి.. 1998– 1999 ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా పోటీచేసి పార్లమెంట్‌కు వెళ్లారు. పెద్దపల్లి నియోజకవర్గం 1952, 57లో కరీంనగర్‌ ద్విసభ్య లోక్‌సభగా ఉండేది. ఆ రెండుసార్లు పీడీఎఫ్‌ అభ్యర్థి ఎంఆర్‌ కృష్ణ విజయం సాధించారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరి 1962, 67లో తిరిగి గెలుపొందారు. 1971లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా తులసీరామ్‌ పోటీచేసి గెలిచారు. 1977లో కాంగ్రెస్‌లో చేరి గెలుపొందగా, 1980లో కోదాటి రాజమల్లు కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించారు. 1984లో టీడీపీ నుంచి పోటీచేసిన గొట్టె భూపతి గెలువగా, 1989, 91, 96లో కాంగ్రెస్‌ తరఫున జి.వెంకటస్వామి హ్యాట్రిక్‌ విజయం సాధించారు. 1998– 99లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ సుగుణకుమారి గెలువగా, 2004లో మళ్లీ జి.వెంకటస్వామి విజయం సాధించారు. 2009లో జి.వివేక్‌ కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. 2014లో

బాల్క సుమన్‌, 2019లో వెంకటేశ్‌ నేత బీఆర్‌ఎస్‌ నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌ నుంచి ‘కాకా’ మనుమడు గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గొమాస శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఆయా పార్టీలు ప్రకటించాయి. చిన్నపార్టీలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా ఎవరైనా మహిళలు ఎన్నికల బరిలో నిలుస్తారో లేదో వేచిచూడాలి.

పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో ఓటర్ల వివరాలు

అసెంబ్లీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

చెన్నూరు 95,966 97,264 7 1,93,237

బెల్లంపల్లి 86,800 88,530 13 1,75,343

మంచిర్యాల 1,38,451 1,40,553 25 2,79,029

ధర్మపురి 1,11,951 1,17,646 6 2,29,603

రామగుండం 1,10,238 1,09,966 26 2,20,230

మంథని 1,17,262 1,21,819 17 2,39,098

పెద్దపల్లి 1,26,386 1,29,961 7 2,56,354

మొత్తం 7,87,054 8,05,739 101 15,92,894

Election 2024

Read latest Peddapalli News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top