అన్వేష హాస్టల్‌లో అక్రమాలు | Sakshi
Sakshi News home page

అన్వేష హాస్టల్‌లో అక్రమాలు

Published Sat, May 25 2024 3:10 PM

అన్వేష హాస్టల్‌లో అక్రమాలు

నలుగురు అసిస్టెంట్‌

సూపరింటెండెంట్ల సస్పెన్షన్‌

ద్వితీచంద్ర సాహుకు ఇన్‌చార్జి

బాధ్యతలు అప్పగింత

కలెక్టర్‌ మనోజ్‌ సత్యవాన్‌ మహాజన్‌ ఆదేశాలు

రాయగడ: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని పెట్టాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహించారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అధికారుల విచారణలో నిజమని తేలడంతో నలుగురు అసిస్టెంట్‌ సూపరింటెండెంట్లపై సస్పెన్షన్‌ వేటు వేశారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కొట్లాగుడ వద్ద అన్వేష హాస్టల్‌ను నిర్వహిస్తున్నారు. ఆదివాసీ హరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో నడుపుతున్న ఈ వసతి గృహంలో సుమారు వెయ్యిమంది విద్యార్థులు ఉంటున్నారు. పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇంగ్లిష్‌ మాధ్యమంలో చదువుకుంటూనే ఇక్కడ ఉండేవారు. మొత్తం నాలుగు వార్డుల్లో నివాసం ఉండే వీరందరికీ ప్రభుత్వం అందించే ఆహారం విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే

ఆరోపణలు వచ్చాయి. దీంతో జిల్లా సంక్షేమ శాఖ అధికారి భరత్‌ భూషణ బిశ్వాల్‌ ఐదు నెలల క్రితం అన్వేష హాస్టల్‌ను సందర్శించి దర్యాప్తు చేశారు. ప్రతీ బుధవారం విద్యార్థులకు చికెన్‌ కూరతో కూడిన ఆహారాన్ని అందించాల్సి ఉన్నప్పటికీ దానికి బదులుగా పన్నీరు కూరతో భోజనం పెట్టినట్టు అధికారుల విచారణలో తేలింది. అలాగే నాణ్యమైన ఆహారాన్ని అందివ్వడం లేదని సంక్షేమ శాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్‌ మనోజ్‌ సత్యవాన్‌ మహాజన్‌ చర్యలకు ఉపక్రమించారు. నలుగురు అసిస్టెంట్‌ సూపరింటెండెంట్లను సస్పెండ్‌ చేస్తూ గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఇన్‌చార్జి బాధ్యతలను ఉపాధ్యాయుడు ద్వితీ చంద్ర సాహుకు అప్పగిస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో హాస్టల్‌ ఒకటి, రెండు, మూడు, నాలుగు వార్డులకు చెందిన అసిస్టెంట్‌ సూపరింటెండెంట్లు రమాకాంత పట్నాయక్‌, గౌరీశంకర్‌ పిడిక, అరుంధతి పండ, ఎం.శివప్రసాదరావు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement