కొరియర్‌ పేరుతో సైబర్‌ మోసాలు | Sakshi
Sakshi News home page

కొరియర్‌ పేరుతో సైబర్‌ మోసాలు

Published Sat, May 25 2024 3:05 PM

-

పార్వతీపురంటౌన్‌: ఫెడెక్స్‌ కొరియర్‌ పేరతో సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నారని, ప్రతి ఒక్కరూ అప్రత్తంగా ఉండాల్సిందేనని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. స్థానిక విలేకరులతో ఆయన శుక్రవారం మాట్లాడారు. ఇన్నాళ్లూ ఉద్యోగం, వ్యాపారం, చలానాలు, ఆఫర్లు అంటూ మోసం చేసేవారని, ఇప్పుడు కొరియర్‌ పేరిట కొత్త మోసాలకు తెరతీస్తున్నారన్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాదికి ఫెడెక్స్‌ కొరియర్‌ సంస్థ నుంచి కాల్‌ చేస్తున్నాం... మీరు ముంబయి నుంచి థాయ్‌లాండ్‌కు పంపించిన పార్సిల్‌లో డ్రగ్స్‌తో పాటు ఇతర నిషేధిత వస్తువులు ఉన్నాయి.. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. కేసు నుంచి తప్పించాలంటే డబ్బులు ఇవ్వాలంటూ దాదాపు రూ.15 లక్షలు కాజేశారన్నారు. తమ సంస్థ పేరుతో జరుగుతున్న మోసాలపై ఫెడెక్స్‌ సైతం స్పందించిందన్నారు. ఫోన్‌కాల్స్‌ ద్వారా తాము ఎప్పుడూ వ్యక్తిగత సమాచారం కోరబోమని తెలిపిందన్నారు. ఎవరైనా వ్యక్తిగత సమాచారం కోరుతూ ఫోన్లు, మెసేజ్‌ చేస్తే వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఇవి పాటించండి...

● అనుమానాస్పదంగా అనిపించే ఫోన్‌ కాల్స్‌కు రియాక్ట్‌ అవ్వొద్దు

● యూపీఐ పిన్‌, ఐడీ లాంటి సమాచారాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ షేర్‌ చేయొద్దు.

● అధికారిక ఫెడెక్స్‌ వెబ్‌సైట్లో మాత్రమే ప్యాకేజీ స్టేటస్‌ను చెక్‌ చేయాలి.

● సైబర్‌ నేరాలపై ఫిర్యాదు కొరకు 1930 నంబర్‌కు, లేదంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సైబర్‌క్రైమ్‌.జీఓవీ.ఇన్‌లో ఫిర్యాదు చేయొచ్చు.

అప్రమత్తంగా ఉండాల్సిందే...

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement