Sakshi News home page

వేళాయె!

Published Thu, Apr 18 2024 1:00 AM

పూజలందుకుంటున్న మజ్జిగౌరి అమ్మవారు - Sakshi

మజ్జిగౌరి చైత్రోత్సవాలకు..

రాయగడ : ఆంధ్ర, ఒడిశా ప్రజల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి రాయగడ మజ్జిగౌరి అమ్మవారి వార్షిక చైత్రోత్సవాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ముందురోజు సమీపంలోని జంఝావతి నది నుంచి పురోహితులు, కమిటీ సభ్యులు శుద్ధ జలాలను తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో ఉంచి శుద్ధి చేసి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఏటా చైత్ర మాస ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఐదు రోజులూ చండీ హోమం, సూర్యా ఆవాహనం, సొడొపొచార తదితర పూజలు నిర్వహిస్తారు. బరంపురంలోని కవిసూర్యనగర్‌ నుంచి ప్రత్యేకంగా పురోహితులను రప్పించి పూజా కార్యక్రమాలు జరిపిస్తారు.

కన్యలతో ఘటాల ఊరేగింపు..

ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ అమ్మవారి ఘటాలను పట్టణంలో ఊరేగిస్తారు. దుష్టశక్తులు చొరబడకుండా అమ్మవారు రక్షిస్తారన్నది భక్తుల నమ్మకం. వివాహం కాని యువతులు(కన్యలు) మాత్రమే ఘటాలు మోయడం ఇక్కడి ప్రత్యేకత. అమ్మవారి ప్రతీకగా నిలిచే పసుపు, బియ్యంతో తయారు చేసే బొట్టును అందరికి పంపిణీ చేస్తారు. ఈ మిశ్రమాన్ని నీటిలో కలిపి తాగితే ఎటువంటి రోగాలు దరిచేరవన్నది భక్తుల నమ్మకం.

మల్లెలు తొక్కడం..

ఉత్సవాల్లొ భాగంగా చివరి రోజు మల్లెలు తొక్కే కార్యక్రమం ఉంటుంది. ఎర్రని నిప్పులపై పూజారులు ఘటాలను మోసుకుంటూ నడుస్తారు. ముళ్లుతో రూపొందించిన ఊయలపై ఊగుతారు. అయినా ఎటువంటి బాధ కలగదని, అమ్మవారు ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని భక్తులు చెబుతున్నారు. ఈ ఘట్టం తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు.

ఆదరణ కరువై..

రాజు మరణానంతరం రాయగడ గోడ శిథిలావస్తకు చేరుకుంది. ఆలనాపాలనా లేక అమ్మవారి మందిరం కూడా జీర్ణావస్తకు చేరుకుంది. 1930లో బ్రిటీషర్లు విజయనగరం నుంచి రాయిపూర్‌ వరకు రైలు మార్గం వేసేందుకు సన్నహాలు చేస్తున్న క్రమంలో రాయగడ సమీపంలో జంఝావతి నదిపై వంతెన నిర్మాణం చేపడతారు. ఎన్నిసార్లు కట్టినా వంతెన కూలిపోతుండటంతో కాంట్రాక్టర్‌ ఇబ్బందులు పడుతుంటాడు. ఓ రోజు కాంట్రాక్టర్‌ కలలొ అమ్మవారు దర్శనమిచ్చి వంతెన సమీపంలో గుడి కట్టించి పూజా కార్యక్రమాలు చేస్తే పనులు శరవేగంగా పూర్తవుతాయని చెబుతారు. మెలకువ వచ్చి వెంటనే కాంట్రాక్టర్‌ ఆ పరిసరాలను వెతకగా పాడైన ఓ చిన్న మందిరంలో అమ్మవారి విగ్రహం కనిపించడంతో వెంటనే కాంట్రాక్టర్‌ అమ్మవారికి పూజించి మందిర నిర్మాణం చేపట్టారు. వంతెన నిర్మాణ పనులు కూడా పూర్తవుతాయి. ఇది నందపూర్‌ చరిత్రలో వివరించారు.

అమ్మవారి వాహనం

దుష్టశక్తుల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు అమ్మవారు ప్రతి రోజు రాత్రి గుర్రంపై పురవీధుల్లో సంచరిస్తుంటారని చరిత్ర కథనం. దీనికి అనుగుణంగా మందిరం ప్రాంగణంలో అమ్మవారికి ఎదురుగా రంకెలు వేసే విగ్రహాన్ని ఆలయ నిర్వాహకులు 5 క్వింటాళ్ల ఇత్తడితో రూపొందించారు.

ముడుపులు కట్టే చెట్టు..

అమ్మవారి మందిర ప్రాంగణంలో పెద్ద రావి చెట్టు ఉంది. కోర్కెలు తీరాలంటూ భక్తులు ఈ చెట్టుకు ఎర్రని గుడ్డ కడతారు. ఒడిశా, ఆంధ్ర, తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ముఖ్యంగా ఆది, సోమ, మంగళవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువ. అమ్మవారికి నిత్యభోగంతో పాటు చక్కెర, రవ్వ, బియ్యం పిండితో తయారు చేసే కక్కరాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

మూడు ప్రాంతాల్లో అమ్మవారి శరీర భాగాలు

మజ్జిగౌరి అమ్మవారి ముఖం మాత్రమే మందిరంలో ఉంటుంది. కేవలం ముఖానికే పూజలు చేయ డం ఇక్కడి ప్రత్యేకత. మొండెం వేరే చోట, పాదాలు మరోచోట ఉంటూ పూజలందుకుంటున్నాయి. మందిరం ప్రాంగణానికి కొద్దిదూరంలో అమ్మవారి పాదాలు, రోడ్డుకు ఆవల అమ్మవారి మిగతా శరీర భాగం ఉందన్నది స్థల పురాణం. మొండెం ఉన్న ప్రాంతాన్నే జెన్నరాయిగా పిలుస్తుంటారు. ఇక్కడ దసరా సమయంలో అష్టమి నాడు ప్రత్యేక(నిశా రాత్రి) పూజ చేస్తారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరగడంతో మందిరం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతోంది.

స్థల చరిత్ర..

15వ శతాబ్దంలో నందపూర్‌ మహారాజైన విశ్వనాథ్‌ దేవ్‌ తన రాజ్యాన్ని విస్తరించే కార్యక్రమంలో రాయగడలో కోట కడతారు. నిత్యం కొలిచే అమ్మవారిని కోట మధ్యలో కొలువుదీర్చి పూజలు చేస్తుంటారు. కోట మధ్యలో అమ్మవారిని నిలపడంతో మొఝి ఘొరియాణి (మజ్జి గౌరి)గా పేరువచ్చింది. తెలుగువారు మజ్జిగౌరిగా, ఒడియా ప్రజలు మొఝి ఘొరియాణిగా పిలుస్తుంటారు. విశ్వనాథ్‌ దేవ్‌ మహారాజుకు 108 మంది రాణులు ఉండేవారు. గోల్కొండ పాలకుడు ఇబ్రహిం కుతుబ్‌ షా సేనాధిపతి రుతుఫ్‌ఖాన్‌ రాయగడపై 1538లో దాడి చేయడంతో రాజు వీరమరణం పొందారు. ఆయన సతీమణులు 108 మంది సతీ సహగమనం చేశారు. మందిర సమీపంలో ప్రాణత్యాగం చేసిన ఈ ప్రాంతాన్ని సతీకుండంగా పిలుస్తుంటారు. ఏటా సంక్రాంతి నాడు ఈ స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

Advertisement
Advertisement