Sakshi News home page

మాజీ మంత్రి పద్ధతి మార్చుకోవాలి

Published Tue, Apr 16 2024 2:00 AM

గుర్రంపోడు ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లును పార్టీలోకి ఆహ్వానిస్తున్న శంకర్‌నాయక్‌
 - Sakshi

మిర్యాలగూడ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై.. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అవాకులు చెవాకులుగా మాట్లాడుతున్నారని, ఇది సరికాదని.. ఆయన పద్ధతి మార్చుకోవాలని డీసీసీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. సోమవారం మిర్యాలగూడలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగదీష్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నల్లగొండ జిల్లాలో 1102 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రికార్డులు చెబుతున్నాయని.. దీనికి జగదీష్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. సేవే జీవితంగా బతికే వెంకట్‌రెడ్డిని విమర్శించే స్థాయి జగదీష్‌రెడ్డికి లేదన్నారు. జగదీష్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ కూడా రైతుల బాధలను పట్టించుకోలేదన్నారు. జగదీష్‌రెడ్డి చేసిన అవినీతి అక్రమాలకు రేపోమాపో జైలుకు వెళ్తాడన్నారు. సమావేశంలో స్కైలాబ్‌నాయక్‌ ఉన్నారు.

గుర్రంపోడు ఎంపీపీ కాంగ్రెస్‌లో చేరిక

ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు, గుర్రంపోడు ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు సోమవారం మిర్యాలగూడలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా శంకర్‌నాయక్‌ ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అవినీతిలో కూరుకుపోయిందని, ఆ పార్టీ ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో రఘువీర్‌రెడ్డికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కంచర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, తలకొప్పుల సైదులు, నర్సయ్య, సర్వయ్య, వెంకటేశ్వర్లు, నరసింహారావు, జగదీష్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, రాధాకృష్ణ, గణేష్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement