Sakshi News home page

No Headline

Published Sat, Apr 13 2024 1:15 AM

జిల్లా కేంద్రంలోని ప్రథమ చికిత్స కేంద్రంలో 
తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు (ఫైల్‌)  - Sakshi

నాగర్‌కర్నూల్‌ క్రైం: మాతృత్వం మహిళకు ఒక గొప్ప వరం. ఆడ.. మగ అనే వివక్ష లేకుండా ఇద్దరిని సమానంగా చూడాల్సిన సమాజంలో నేటికీ ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, తెలుసుకోవడం నేరమైనప్పటికీ.. కొందరు వైద్యులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. పలు ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లలో గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 158 ప్రైవేటు ఆస్పత్రులు ఉండగా.. 58 స్కానింగ్‌ సెంటర్లు కొనసాగుతున్నాయి. 21 స్కానింగ్‌ సెంటర్లు పనిచేయడం లేదని సమాచారం. వైద్యారోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కొన్ని ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లలో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు అబార్షన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉన్న విజయ ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌లో చాలా రోజులుగా స్థాయికి మించి వైద్యంతో పాటు అబార్షన్లు సైతం చేస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదులు రావడంతో ఈనెల 6న తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా ప్రథమ చికిత్స కేంద్రంలోని మందులు, పలు స్కానింగ్‌ సెంటర్లకు సంబంధించిన రిపోర్టులను అధికారులు స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. అయితే అధికారులు స్వాధీనం చేసుకున్న స్కానింగ్‌ రిపోర్టులు ఏ సెంటర్లకు సంబంధించినవనే విషయాలపై సమగ్ర విచారణ జరిపితే, మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే ఆస్కారం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కనిపించని మార్పు..

జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో పాటు స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులతో ఇటీవల కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరిపితే, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా మార్పు కనిపించడంలేదు. అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాలలోని ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు నిఘా పెంచడంతోపాటు తరుచూ తనిఖీలు, సమీక్షలు నిర్వహిస్తే మార్పు వచ్చే అవకాశం ఉంది. లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు నిర్వహించే ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్ల అనుమతులను శాశ్వతంగా రద్దు చేస్తే, అందరిలో భయం ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

స్థాయికి మించి ఆర్‌ఎంపీల వైద్యం..

జిల్లాలో దాదాపు 300 మందికి పైగా ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స కేంద్రాలను నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు స్థాయికి మించి వైద్యం అందిస్తూ, రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ ప్రథమ చికిత్స కేంద్రంలో ఇటీవల మహిళకు అబార్షన్‌ చేయగా తీవ్ర రక్తస్రావమైంది. ఆమెను చికిత్స నిమిత్తం జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా జిల్లా ఆస్పత్రికి ఎదురుగా ఆర్‌ఎంపీలు నిర్వహిస్తున్న క్లినిక్‌లలో పలువురు చికిత్స కోసం వచ్చి, మృత్యువాత పడ్డ ఘటనలు లేకపోలేదు. కొన్ని ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్లతో ఆర్‌ఎంపీలు కుమ్మక్కయి, లింగ నిర్ధారణ పరీక్షలు సైతం చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

యథేచ్ఛగా సాగుతున్న

పరీక్షలు, ఆబార్షన్లు

కాసుల కోసం కక్కుర్తి పడుతున్న ఆర్‌ఎంపీలు

నామమాత్రపు తనిఖీలతో

సరిపెడుతున్న అధికారులు

కలెక్టర్‌ సమీక్ష నిర్వహించినా

ఫలితం శూన్యం

Advertisement

తప్పక చదవండి

Advertisement