ఘనంగా హేమాచలుడి రథోత్సవం | Sakshi
Sakshi News home page

ఘనంగా హేమాచలుడి రథోత్సవం

Published Sat, May 25 2024 2:10 PM

ఘనంగా

ఊరేగింపులో రఽథాన్ని లాగుతున్న గ్రామస్తులు

మంగపేట: మండలంలోని మల్లూరులో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు రథోత్సవ కార్యక్రమం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. మల్లూరుగుట్టపై గల శ్రీ హేమాచల క్షేత్రంలో ఈ నెల 19 నుంచి జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో (జాతర) భాగంగా ఆలయ ఇన్‌చార్జ్‌ కార్యనిర్వాహణ అధికారి పర్యవేక్షణలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, శిష్య బృందం ఆలయ అర్చకులు ఉదయం ఆలయంలో స్వామివారికి నిత్య పూజ, సేవా కాలం, బాలబోగం సంక్షిప్త రామాయణ హవనం, పూర్ణాహుతి, మమానివేదన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాలకు ముందుగా ఆలయ ప్రాంగణంలోని దైత(వనదేవత) అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తిరుమంజనం, శ్రీ లక్ష్మీసహస్రనామ స్తోత్ర పారాయణ, హవనం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. లక్ష్మీనర్సింహాస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నూతన పట్టు వస్త్రాలతో ముస్తాబు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకి (సేవపై)లో మంగళవాయిధ్యాల నడుమ గుట్టపై నుంచి మల్లూరు గ్రామానికి చేర్చారు. రాత్రి 8 గంటల నుంచి గ్రామంలో ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి పురవీధుల్లో మేళతాలాల నడుమ టపాసులు పేల్చుతూ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన జంటగా గ్రామానికి వచ్చిన దేవతామూర్తులకు మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి మంగళహారతులతో ఎదురేగి దర్శించుకున్నారు. బిందెలతో నీల్లారబోసి టెంకాలు కొట్టి పాడిపంట సంవృద్ధిగా పండాలని తమ పిల్లాపాపలు చల్లంగా ఉండేలా చూడాలని కోరుకున్నారు.

ఆకట్టుకున్న కళాకారుల విన్యాసాలు

ఉత్సవ మూర్తుల ఊరేగింపు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని ద్రాక్షారామం నుంచి వచ్చిన కళాకారుల బృందం వివిధ రూపాల వేషధారణతో చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారులు విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు కార్యక్రమం రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. దీంతో గ్రామంలో పండగ సందడిని తలపించింది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, యాగ్నిక పూజారులు, గ్రామస్తులు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దైత అమ్మవారికి

పంచామృతాలతో అభిషేకం

గ్రామంలో పండుగ వాతావరణం

అలరించిన కళాకారుల నృత్యాలు

ఘనంగా హేమాచలుడి రథోత్సవం
1/3

ఘనంగా హేమాచలుడి రథోత్సవం

ఘనంగా హేమాచలుడి రథోత్సవం
2/3

ఘనంగా హేమాచలుడి రథోత్సవం

ఘనంగా హేమాచలుడి రథోత్సవం
3/3

ఘనంగా హేమాచలుడి రథోత్సవం

Advertisement
 
Advertisement
 
Advertisement