Sakshi News home page

కాంగ్రెస్‌కు ఓటమి భయం

Published Wed, Mar 27 2024 7:35 AM

మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు  - Sakshi

మెదక్‌: ఓటమి భయం కాంగ్రెస్‌ నేతల్లో పట్టుకుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అందుకే రోజుకో నాయకుడి ఇంటికి వెళ్లి పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు. మెదక్‌ జిల్లా బీఆర్‌ఎస్‌కు కంచుకోటన్నారు. మంగళవారం మెదక్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మంచివాడైతే దుబ్బాకలో ప్రజలు గెలిపించేవారని, అలా జరగలేదని ఓటమి చవిచూశారన్నారు. వందరోజుల కాంగ్రెస్‌ పాలన అందరికీ అర్థమైందని, ఆపార్టీ పని అయిపోయిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. పింఛన్లు, ఉచిత విద్యుత్‌, రుణమాఫీ, పంటలకు బోనస్‌ ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. వంద రోజుల పాలన చూసి ఓటు వేయాలంటున్న కాంగ్రెస్‌ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుతుందని ప్రశ్నించారు. గతంలో కొత్త ప్రభాకర్‌రెడ్డిని రాష్ట్రంలోనే అతిపెద్ద మెజార్టీతో మెదక్‌ ఎంపీగా గెలిపించిన చరిత్ర ఈ జిల్లాకే దక్కిందని గుర్తు చేశారు. అదే తరహాలో మరోసారి వెంకట్రాంరెడ్డిని గెలిపించాలని ఇందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. అనంతరం బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ, తనను గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటానన్నారు. తాను సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ హేమలత, మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు చంద్రపాల్‌, మల్లికార్జున్‌గౌడ్‌లు, ఆంజనేయులు పాల్గొన్నారు.

బీజేపీ అభ్యర్థి మంచివాడైతే దుబ్బాకలో గెలిచేవాడు

మాజీ మంత్రి హరీశ్‌రావు

Advertisement

What’s your opinion

Advertisement