Sakshi News home page

No Headline

Published Mon, Mar 25 2024 9:20 AM

కొండపాక మండలం శెలంపు ప్రభుత్వ పాఠశాలలో కుట్లు పోయిన నెక్కర్‌తో వచ్చిన విద్యార్థి(ఫైల్‌) - Sakshi

సాక్షి, సిద్దిపేట: సర్కారు బడుల్లోని విద్యార్థులకు ప్రతి ఏటా ఉచితంగా స్కూల్‌ యూనిఫాంలను ప్రభుత్వం అందజేస్తోంది. ఒక్కో విద్యార్థికి రెండేసి జతలను ఉచితంగా ఇస్తోంది. 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్‌, కేజీబీవీలు, మోడల్‌ స్కూల్‌లలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా క్లాత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. 2024–2025 విద్యాసంవత్సరానికి ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 2,77,787 విద్యార్థులు ఉన్నారు. అందులో బాలురు 1,35,327 బాలికలు 1,42,460 ఉన్నారు. రెండేసి జతలు మొత్తం 5,55,574 డ్రెస్‌లకు గాను రూ 2,77,78,700 నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీరందరికీ సైజుల ప్రకారం యూనిఫాంలు కుట్టించేందుకు మహిళా పొదుపు సంఘాల సభ్యులకు అప్పగించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీ వరకు క్లాత్‌ను అప్పగిస్తే జూన్‌1న పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అందించాలని అదేశించారు.

కూలి పెంచాలి

జిల్లాలకు స్కూల్‌ డ్రెస్‌లకు సంబంధించిన క్లాత్‌ త్వరలో రానున్న నేపథ్యంలో మహిళా పొదుపు సంఘాలకు స్టిచ్చింగ్‌ బాధ్యతలను అప్పగిస్తున్నారు. మొదట ఆనందం వ్యక్తం చేసిన మహిళా సంఘాల సభ్యులు కూలి ధరలను చూసి ఆశ్చర్యపోతున్నారు. మార్కెట్‌లో ఒక్కో డ్రెస్‌ స్టిచ్చింగ్‌ చేస్తే రూ.300 నుంచి రూ. 500 వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో డ్రెస్‌కు రూ.50 మాత్రమే చెల్లిస్తామని ప్రకటించడంతో మెటీరియల్‌కే సరిపోతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 200 గుండీల ప్యాకెట్‌ ధర రూ.150, మరో వైపు దారం బాక్స్‌ రూ.200 ఉంది. అలాగే జిప్స్‌ ఒక్కొక్కటి రూ.10 ఉంది. కాజాలు, గుండీలు కుట్టినందుకు ఒక్కో షర్టుకు రూ.20 నుంచి రూ30 వరకు తీసుకుంటారు. ఇలా ధరలు ఉండటంతో కూలి గిట్టబాటు కాదని అంటున్నారు. ఒక్కో డ్రెస్‌కు కనీసం రూ.150 నుంచి రూ.200 వరకు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

ఐదేళ్లుగా ఇవే ధరలు

ఐదేళ్ల నుంచి ఒక్కో జతకు రూ.50లు చెల్లిస్తున్నారు. కుట్టు కూలి తక్కువగా ఇస్తుండటంతో కుట్టుల్లో నాణ్యత కరువవుతోంది. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కుట్టిన దారం పోవడంతో విద్యార్థులు పిన్నిస్‌లు పెట్టు కుని పాఠశాలకు వచ్చేవారు. మరోవైపు విద్యార్థుల శారీరక కొలతలు తీసుకోకుండానే కుట్టి అందించారు. అవి వదులుగా, పొట్టిగా, బిగుతుగా ఉన్నాయి. వారు వాటిని ధరించేందుకు ఇష్టం చూపడం లేదు. కుట్టు కూలి ధరలు పెంచకపోతే యూనిఫాం స్టిచ్చింగ్‌లలో నాణ్యత లోపాలు బయటపడే అవకాశాలున్నాయి. గతంలో మాదిరిగానే సమస్యలు పునరావృతం కానున్నాయి.

Advertisement

What’s your opinion

Advertisement