Sakshi News home page

ప్రజాభీష్టం మేరకు పాలన

Published Wed, Apr 17 2024 1:20 AM

 వేదికను పరిశీలిస్తున్న మంత్రి  తుమ్మల  - Sakshi

మహబూబాబాద్‌ రూరల్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాభీష్టం మేరకు పాలన కొనసాగిస్తోందని రాష్ట్ర భారీ నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యాన శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు అన్నారు. మంగళవారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్లమెంట్‌ నియోజవర్గ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భద్రాచలం రాములవారి దీవెనలతో 19వ తేదీన కాంగ్రెస్‌ మహబూబాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ నామినేషన్‌ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సభకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరవుతారన్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నామినేషన్‌ కార్యక్రమంతోనే కాంగ్రెస్‌ గెలుపు ఖాయం కావాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని, నీటి వనరులను కూడా అస్తవ్యస్తం చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్‌ పార్టీ 6 గ్యారంటీలలో చాలా వరకు అమలు చేశామని, ఆగస్టు 15వ తేదీ లోపు రైతులకు రుణ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. అనంతరం ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభ సభాస్థలి ఎన్టీఆర్‌ స్టేడియాన్ని పరిశీలించారు. సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌ చందర్‌ రెడ్డి, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌, ప్రభుత్వ విప్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రాంచంద్రునాయక్‌, ఎమ్మెల్యేలు డాక్టర్‌ మురళీనాయక్‌, దొంతి మాధవరెడ్డి, తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, నాయకులు సాదు రమేష్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అర్బన్‌ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు నూనావత్‌ రాధా, నారోజు సత్యమనోరమ, చుక్కల ఉదయ్‌ చందర్‌, దేవరం ప్రకాష్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు

19న సీఎం రేవంత్‌ రెడ్డి సభను

విజయవంతం చేయాలి

Advertisement
Advertisement