Sakshi News home page

విద్యార్థులకు నీళ్ల చారే దిక్కు

Published Tue, Nov 14 2023 1:18 AM

నీళ్ల చారును వడ్డిస్తున్న సిబ్బంది - Sakshi

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మండల పరిధిలోని బయ్యక్కపేట గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సోమవారం నీళ్ల చారుతోనే భోజనం వడ్డించారు. పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని కార్మికులు తయారు చేశారు. మొదట దోసకాయ కూర వడ్డించిన వర్కర్లు కూర అయిపోవడంతో మారన్నం వేసుకున్న విద్యార్థులు నీళ్ల చారుతో భోజనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశాలలో ఎక్కువగా ఆదివాసీ గొత్తికోయ పిల్లలు చదువుకుంటున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనానికి సరిపడా కూర వండాల్సి ఉండగా అరకొరగా దోసకాయ కూర వండటంతో రెండో సారి అన్నం పెట్టుకున్న విద్యార్థులకు నీళ్ల చారుతోనే సరిపెట్టారు. దీపావళి సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడం గమనార్హం. సుమారు 50 మంది విద్యార్థులకు భోజనం వడ్డించినట్లు సిబ్బంది తెలిపారు. ఎక్కువగా ఆదివాసీ గొత్తికోయ పిల్లలే పాఠశాలలో ఉండటంతో వారికి హెచ్‌ఎంను ప్రశ్నించే ధైర్యం లేకపోవడంతో ఇష్టారీతిన చాలిచాలని కూరలతో భోజనం పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మారుమూల ప్రాంతంలో ఆశ్రమ పాఠశాల ఉండటంతో అధికారులు ఎవరు కూడా అటువైపుగా వెళ్లిన దాఖలాలు లేవు. దీంతో పాఠశాల నిర్వాహకులే భోజనం విషయంలో మెనూ పాటించకుండా వారు నిర్ణయించిన కూరలు మాత్రమే వండిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించి ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు సరైన భోజనం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement