Sakshi News home page

ఆనందం.. అంతలోనే విషాదం

Published Thu, Nov 16 2023 6:18 AM

మహేశ్‌ మృతదేహం - Sakshi

● బయల్దేరిన ఐదు నిమిషాల్లోనే.. ● కారు బోల్తాపడి ఇద్దరు మృతి ● మరో ముగ్గురికి తీవ్రగాయాలు ● కూతురును కళాశాలలో దింపేందుకు వెళ్తుండగా ఘటన ● హబ్సీపూర్‌, రాజారం గ్రామాల్లో విషాదం

జగిత్యాల క్రైం: కూతురును కళాశాలలో దింపేందుకు ఓ వ్యక్తి తన బంధువులతో కలిసి కారులో ఆనందంగా బయల్దేరాడు.. కానీ, ఐదు నిమిషాల్లోనే ఆ వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో హబ్సీపూర్‌, రాజారం గ్రామాల్లో విషాదం నెలకొంది. జగిత్యాల రూరల్‌ ఎస్సై సదాకర్‌ కథనం ప్రకారం.. ధర్మపురి మండలంలోని రాజారం గ్రామానికి చెందిన దేవరకొండ భాస్కర్‌(35) బుధవారం ఉదయం తన అత్తగారి గ్రామమైన హబ్సీపూర్‌కు కారులో వచ్చాడు. తన పెద్ద కూతురు అక్షరను కరీంనగర్‌లోని కళాశాలలో దింపేందుకు మామ, హబ్సీపూర్‌కు చెందిన ఇమ్మడి నందయ్య, బావమరిది శ్రీకాంత్‌, నందయ్య తమ్ముడి కొడుకు మహేశ్‌లతో కలిసి కారులో బయల్దేరాడు. కానీ, దురదృష్టవశాత్తు అది పొలాస శివారులో జగిత్యాల–ధర్మపురి ప్రధాన రహదారిపై అదుపుతప్పి, బోల్తాపడింది. ఈ ఘటనలో భాస్కర్‌, మహేశ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. నందయ్య, అక్షర, కారు నడుపుతున్న శ్రీకాంత్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సదాకర్‌ సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు భాస్కర్‌ భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, భాస్కర్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు, మహేశ్‌కు భార్య, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఎమ్మెల్సీ పరామర్శ..

రోడ్డు ప్రమాదంలో దేవరకొండ భాస్కర్‌, ఇమ్మడి మహేశ్‌లు మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి, ఓదార్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement