వెన్నుపోటుదారుడు కడియం శ్రీహరి | Sakshi
Sakshi News home page

వెన్నుపోటుదారుడు కడియం శ్రీహరి

Published Wed, Apr 17 2024 1:10 AM

అభివాదం తెలుపుతున్న నాయకులు - Sakshi

మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

మడికొండ: కడియం శ్రీహరిని బీఆర్‌ఎస్‌ మంత్రిని చేసింది.. ఎంపీని చేసింది.. ఆయన బిడ్డకు ఎంపీ సీటు ఇస్తే.. తీరా పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లో చేరాడని స్టేషన్‌ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. మంగళవారం స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం కాజీపేట మండలం మడికొండలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరికి సిగ్గు ఉంటే బీఆర్‌ఎస్‌ పెట్టిన భిక్ష మీద గెలిచిన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సిగ్గు లేకుండా తన కుమార్తె కావ్యకు ఓటు వేయాలని ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఎలా తిరుగుతాడో చూస్తాననన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలు ఉద్యమకారుడు, నీతి, నిజాయితీ కలిగిన సుధీర్‌కుమార్‌కు అవీనితి పరుడైన కడియం శ్రీహరికి మధ్య జరుగుతున్నాయన్నారు. తాను మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో ఓడిపోయానని అనడానికి సిగ్గుండాలన్నారు. మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, ఇప్పుడు ఎన్నికల్లో ఏ విధంగా ఓట్లను అడుగుతారని ప్రశ్నించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి కడియం చేసిందేమీ లేదన్నారు. ఏడు రిజర్వాయర్లు తెచ్చింది రాజయ్య, రాజేశ్వర్‌రెడ్డి అని పేర్కొన్నారు. వంద పడకల ఆస్పత్రి మంజూరు చేయిస్తే నిలిపి వేసింది కడియం శ్రీహరి కాదా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్ధి మారేపల్లి సుధీర్‌కుమార్‌, వరంగల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, నియోజకవర్గంలోని ఏడు మండలాల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement