Sakshi News home page

ప్రధాని కావడం ముఖ్యం కాదు: రాహుల్ గాంధీ

Published Thu, Mar 6 2014 3:22 AM

ప్రధాని కావడం ముఖ్యం కాదు: రాహుల్ గాంధీ - Sakshi

మహారాష్ట్రలో రాహుల్ వ్యాఖ్య
యువత భయంతో కాకుండా విశ్వాసంతో మెలగాలి
బ్రిటిషర్లను తరిమేసినట్లు బీజేపీని తరిమేస్తాం

 
 సాక్షి, ముంబై: తాను ప్రధాని అవుతానా, లేదా అన్న విషయం ముఖ్యంకాదని, అయితే దేశంలోని యువత, మహిళలతోపాటు భారతీయులంతా ఎలాంటి భయాలు లేకుండా ఇది తమ దేశంగా భావించడం చాలా ముఖ్యమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. ‘భారత్‌లో భయంలేని భారతీయుడు ఉండాలన్నదే నా దృక్పథం. అలాంటి దేశాన్నే నేను కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. యువత భయంతో కాకుండా విశ్వాసంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఆయన బుధవారం రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ విద్యార్థులతో ముచ్చటించారు. ప్రధాని అవుతున్నందుకు మీకు అభినందనలు అని యువకుడు చెప్పగా రాహుల్ పైవిధంగా బదులిచ్చారు. యువకులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఏ ఒక్కరు కూడా తన సొంత దేశంలో భయంగా ఉందన్న మాటే అనరాదన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
 
రానున్న పదేళ్లలో ఇక్కడున్న వారిలో చాలామందిని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా... వీలైతే ప్రధానమంత్రిగానూ చూడాలనుకుంటున్నాను.
 -    ఆత్మవిశ్వాసం లేకనే జర్మన్ నియంత హిట్లర్ పెద్దగా అరిచేవాడు.. అయితే మహాత్మా గాంధీ మౌనంగా ఉండి ఎప్పుడూ విశ్వాసంతో ఉండేవారు. ఏ విషయాన్నైనా ఆగ్రహంతో కాకుండా ప్రేమతో చెప్పాలి.
 
 ఒక్కరి చేతికే బీజేపీ అధికారం
 ఔరంగాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ఒక్క వ్యక్తికే అధికారాన్ని కట్టబెట్టాలన్నది బీజేపీ నైజ మని రాహుల్ అన్నారు. ఇదే వైఖరి తో ఉన్న బ్రిటీష్ వారిని తమ పార్టీ దేశం నుంచి తరిమిగొట్టినట్లే, వీరిని కూడా తరిమేస్తామన్నారు. ఈ సభ లో రాహుల్ ఇంకా ఏమన్నారంటే...
 
 కాంగ్రెస్ హింసతోకాకుండా ప్రేమతో ఆంగ్లేయులను దేశం నుంచి వెడలిగొట్టింది. అదేమాదిరి బీజేపీని కూడా పంపిస్తాం. దేశాన్ని నడిపేది ఒక్క వ్యక్తి కాదని, కోట్లాది మంది ప్రజలన్న విషయాన్ని బీజేపీ గుర్తెరగాలి.
-     తన కేబినెట్‌లో ముగ్గురు అవినీతి మంత్రులున్నా మోడీ అవినీతి కనిపించలేదా? కర్ణాటకలో వారి ముఖ్యమంత్రి జైలుకెళ్లారు. అయినా దాన్ని మరచి వారు అవినీతిపై మాట్లాడుతుండటం శోచనీయం.
 
 కొసమెరుపు: అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తిన రాహుల్ గాంధీ... ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో చార్జిషీటుకెక్కిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్‌తో వేదిక పంచుకోవడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement