Sakshi News home page

పెద్దన్నపై తొడగొట్టిన కొరియా!

Published Sat, Oct 10 2015 2:59 PM

పెద్దన్నపై తొడగొట్టిన కొరియా! - Sakshi

ప్యాంగ్యాంగ్: అమెరికా తలపెట్టే ఎలాంటి యుద్ధానికైనా సిద్ధమంటూ అంతర్జాతీయంగా ఏకాకి అయిన ఉత్తర కొరియా ప్రకటించింది. ఉత్తర కొరియా అధికార వర్కర్స్ పార్టీ 70వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాజధాని ప్యాంగ్యాంగ్లో భారీస్థాయిలో సైనిక కవాత్తును నిర్వహించింది. ఈ సందర్భంగా దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడుతూ.. 'అమెరికా సామ్రాజ్యవాదులు ఎలాంటి యుద్ధాన్ని తలపెట్టినా దాని ఎదుర్కొనేందుకు పార్టీ రెవెల్యూషనరీ దళాలు సిద్ధంగా ఉన్నాయి' అని చెప్పారు. శక్తివంతంగా సాగిన ఆయన ప్రసంగం ఆద్యంతం రెచ్చగొట్టేరీతిలో సాగింది. గతంలో జాతీయంగా, అంతర్జాతీయంగా పార్టీ నాయకులు, అధికార పార్టీ చేసిన ఘనతలను ఆయన కీర్తించారు. ఈ సందర్భంగా కిమ్ 2 సంగ్ స్క్వేర్ వద్ద వేలమంది సైనికుల కవాత్తు, యుద్ధట్యాంకుల ప్రదర్శన.. ఇలా వేడుక అంతా యుద్ధ సన్నాహాన్ని తలపించింది.

నిరుపేద దేశమైన ఉత్తర కొరియా, ధనిక ప్రజాస్వామిక దేశమైన దక్షిణ కొరియా బద్ధ శత్రువులుగా కొనసాగుతున్నాయి. వీటి మధ్య 1950-53లో జరిగిన యుద్ధం ముగిసినా సంధి ఒప్పందం కుదరలేదు. దీంతో భారీస్థాయిలో అణ్వాయుధాలు, రాకెట్లు పోగుచేసుకున్న ఉత్తర కొరియా దక్షిణ కొరియాను ధ్వంసం చేస్తానని ప్రకటించడంతో ఆ దేశంపై అమెరికా, ఐక్యరాజ్యసమితి ఇప్పటికే తీవ్ర ఆంక్షలు విధించాయి.

Advertisement
Advertisement