అటు యుద్ధమేఘాలు.. ఇటు షాపింగ్ సంబరాలు | Sakshi
Sakshi News home page

అటు యుద్ధమేఘాలు.. ఇటు షాపింగ్ సంబరాలు

Published Mon, Sep 2 2013 8:42 AM

అటు యుద్ధమేఘాలు.. ఇటు షాపింగ్ సంబరాలు

ఒకవైపు సిరియా తిరుగుబాటుతో అట్టుడుకుతుంటే, మరోవైపు అధ్యక్షుడు బషర్ అల్ అసద్ భార్య ఆస్మా అసద్ మాత్రం షాపింగ్, ఇతర సంబరాల్లో మునిగి తేలిపోతున్నారు. పిల్లలకు సిరియన్ ఆహారం పెట్టడానికి కూడా ఇష్టపడని ఆస్మా.. పాశ్చాత్య ఆహారాన్ని భారీ స్థాయిలో తెప్పిస్తారు. లండన్‌కు చెందిన ఆస్మాను అసద్ 2001లో పెళ్లాడారు. పాశ్చాత్య శైలిలో విలాసవంతమైనజీవితానికి అలవాటు పడ్డ ఆస్మా, దేశ పరిస్థితులెలా ఉన్నా, విలాసాల్లో మునిగి తేలుతున్నారు. తిరుగుబాటుదారులకు, సైనిక బలగాలకు హోరాహోరీ పోరు కొనసాగుతున్న సమయంలోనూ తాపీగా షాపింగ్ చేయగలిగారంటే, ఆమె శైలిని అర్థం చేసుకోవచ్చు. దేశ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఆమె బాంబుల తాకిడిని సైతం తట్టుకునే బంకర్‌లో తన ముగ్గురు పిల్లలతో పాటు ఉంటున్నారు.
 
 ఇందులో సకల సౌకర్యాలూ ఉన్నాయి. తన పిల్లలను సిరియన్ ఆహారాన్ని తిననివ్వని ఆమె, వారి కోసం పాశ్చాత్య దేశాల నుంచి భారీ స్థాయిలో ఆహారం తెప్పిస్తుంటా రు. గత ఏడాది సిరియాలో సైనిక దాడులు ఉధృతంగా సాగుతున్న సమయం లో ఆస్మా, లండన్ నుంచి భారీ ఫర్నిచర్‌ను తెప్పించారు. లండన్ కింగ్‌రోడ్డులోని ఫర్నిచర్ దుకాణానికి ఆమె ఈ-మెయిల్‌లో పంపిన ఆర్డర్ లీకవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తెప్పించుకున్న ఫర్నిచర్‌లో 2.70 లక్షల పౌండ్ల విలువ చేసే ఖరీదైన ఐదు షాండ్లియర్లు కూడా ఉన్నాయి.

Advertisement
Advertisement