Sakshi News home page

బ్యాంక్ అటెండరే కీలక సూత్రధారి?

Published Sat, Nov 22 2014 12:47 PM

బ్యాంక్ అటెండరే కీలక సూత్రధారి? - Sakshi

వరంగల్ : వరంగల్ జిల్లా భూపాలపల్లి కాకతీయ గ్రామీణ బ్యాంక్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు.  కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ అంబట్‌పల్లిలో 26 లక్షల నగదు, 36 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఆరు రోజుల క్రితం  కాకతీయ గ్రామీణ బ్యాంక్‌లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. దుండగులు ...దొంగించిన సొత్తును  బ్యాగ్‌లో ఉంచి అంబట్‌పల్లిలో ఓ కిరాణా దుకాణం వద్ద వదిలేసి వెళ్లిపోయారు.  

కాగా ఈ చోరీ కేసులో బ్యాంక్‌ అటెండరే కీలక సూత్రధారి అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. చోరీ ఘటన నుంచి అటెండర్‌ కన్పించకుండా పోయాడు. దాంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. మరోవైపు టాటా సుమోలో చోరీ చేసిన డబ్బు, బంగారాన్ని తరలించినట్లు తెలుస్తోంది. సుమో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో అసలు గుట్టు రట్టు అయ్యింది.

 

బ్యాంక్ నుంచి మాయమైంది రూ.43 లక్షలు కాగా దొరికింది మాత్రం రూ.26 లక్షలు మాత్రమే. అయితే మిగతా రూ.17 లక్షలు ఏమయ్యాయనే మిస్టరీగా మారింది. కాగా 33 కేజీల బంగారం పోయిందని బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేయగా, తాజాగా 36 కేజీల బంగారం దొరకటం గమనార్హం. దాంతో ఎంత బంగారం చోరీకి గురైందన్న విషయంలో బ్యాంకు అధికారులకే స్పష్టత లేదని తెలుస్తోంది. కాగా చోరీ సొత్తు దొరికిన కిరణా షాప్ యజమానిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

Advertisement
Advertisement