Sakshi News home page

నిరుపేదలకు వరం

Published Mon, Aug 31 2015 4:42 AM

The gift to the poor

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద హౌస్ ఫర్ ఆల్ పథకంలో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలను ఎంపిక చేస్తూ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే 100 స్మార్ట్‌సిటీలను, 500 అమృత్ సిటీలతోపాటు ప్రధానమంత్రి ఆవాజ్‌యోజన (పీఏవై) కింద అందరికీ ఇల్లు పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. పీఏవై పథకం కింద దేశంలో 305 పట్టణాలను ఎంపికచేసి 2 కోట్ల ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా పథకాన్ని రూపొందించారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిచేసుకునే 2022 సంవత్సరం వరకు ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని సంకల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో 34 నగరాల్లో ఇళ్ల నిర్మాణాలకు అవకాశం లభించింది. జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు సిరిసిల్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలు, హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట నగర పంచాయతీలు పీఏవై కింద హౌసింగ్ ఫర్ ఆల్ పథకానికి ఎంపికయ్యాయి. పట్టణాల్లో నిరుపేదలు నివసించే మురికి వాడలను గుర్తించి అక్కడి నివాసుల స్థలాల్లోనే ఇళ్ల పునర్నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు.

ఒక్కో ఇంటికి స్థానిక పరిస్థితులను బట్టి రూ.లక్ష నుంచి రూ.2.3 లక్షల వరకు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆరు మున్సిపాలిటీల్లో 3.5 లక్షల కుటుంబాలు లబ్ధి పొందే అవకాశముంది. స్మార్ట్‌సిటీలు, అమృత్ సిటీలగా ఎంపికైన నగరాలకు సైతం ఈ పథకం వర్తిస్తుంది. కరీంనగర్ అమృత్‌కు ఎంపికైనప్పటికీ పీఏవై పథకం వర్తిస్తుండడం ఇండ్లు లేని నిరుపేదలకు వరంలా మారనుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement