ప్లేఆఫ్‌కు కోల్‌కతా | Sakshi
Sakshi News home page

ప్లేఆఫ్‌కు కోల్‌కతా

Published Sat, May 19 2018 11:46 PM

KKR beat SRH to enter playoffs - Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేఆఫ్‌కు చేరింది. శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించి ప్లేఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకుంది. ఫలితంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తర్వాత ప్లేఆఫ్‌కు చేరిన మూడో జట్టుగా నిలిచింది.

సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్‌ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్‌ విజయంలో క్రిస్‌ లిన్‌(55; 43 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రాబిన్‌ ఉతప్ప(45; 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పాత్ర పోషించగా, సునీల్‌ నరైన్‌(29; 10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దినేశ్‌ కార్తీక్‌(25 నాటౌట్‌) తమవంతు బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించారు.

అంతకుముందు  హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, శ్రీవాత్స్‌ గోస్వామి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత గోస్వామి(35; 26 బంతుల్లో 4ఫోర్లు,1సిక్సర్‌)ని కుల్దీప్‌ పెవిలియన్‌కు పంపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చీ రావడంతోనే దూకుడుగా ఆడిన కెప్టెన్‌ విలియమ్సన్‌, ధావన్‌తో కలిసి భారీ స్కోర్‌ సాధించేలా కనిపించాడు.

కానీ సీర్లేస్‌ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. విలియమ్సన్‌(36; 17బంతుల్లో 1ఫోర్‌, 3 సిక్సర్లు) ఔట్‌ కావడంతో మిగతా బ్యాట్స్‌మెన్‌ తడబడటంతో స్కోర్‌ బోర్డు నెమ్మదించింది. ఈ క్రమంలోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న శిఖర్‌ ధావన్‌(50;39 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్‌) మూడో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత మనీష్‌ పాండే(25) మోస్తరుగా ఆడగా, మిగతా వారు నిరాశపరిచారు.

Advertisement
Advertisement