టార్గెట్‌ 175 సీట్లు! | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ 175 సీట్లు!

Published Tue, May 8 2018 3:43 AM

Target is 175 seats! - Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు: వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకు బూత్‌ కమిటీల పాత్ర కీలకమన్నారు. వైఎస్సార్‌సీపీ బూత్‌ కమిటీలకు రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతులు సోమవారం కర్నూలులో ప్రారంభమయ్యాయి. మొదటిరోజు కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బూత్‌ కమిటీలకు శిక్షణ తరగతులను కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అధ్యక్షతన నిర్వహించారు. ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉండేందుకు కారణం వైఎస్‌ జగన్‌ అని సజ్జల స్పష్టం చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రత్యేక హోదాను ఇవ్వాలంటూ ప్రధాని కాకముందే మోదీని కలిసి జగన్‌ విన్నవించిన విషయాన్ని గుర్తు చేశారు. నిరంతరం అబద్దాలు చెబుతూ మోసం చేసే వ్యక్తి చంద్రబాబు అయితే.. నిజాయితీతో మాట మీద నిలబడి ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి జగన్‌ అన్నారు. 

దుష్టపాలనను ప్రజలకు తెలియజేయాలి
చంద్రబాబు చేస్తున్న దుష్ట పాలనపై అందరూ విరక్తి చెందారని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బూత్‌ కమిటీలు నిరంతరం కష్టపడాలని సజ్జల సూచించారు. అధికార టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారుల జాబితాను తయారు చేయాలని సూచించారు. అన్ని పథకాల్లో అధికార పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని, వాటిని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా కక్కిద్దామని స్పష్టం చేశారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే తమ విధివిధానం, ఆలోచన అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడికీ లేని ఆలోచనలు, ఆశయాలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్నాయని, సీఎం కావాలన్నదే ఆయన ఆశయం అయితే కాంగ్రెస్‌లోనే ఉండేవారని చెప్పారు.

ఎన్నికల్లో బూత్‌ కమిటీలు కీలకపాత్ర పోషిస్తాయని శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. చెప్పిన మాట మీద నిలబడే గొప్ప వ్యక్తిత్వం జగన్‌మోహన్‌ రెడ్డిది అని పార్టీ జిల్లా కో–ఆర్డినేటర్‌ మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. జిల్లాలో 14 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలుపొంది జగనన్నకు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో సోషల్‌ మీడియా పాత్ర ఎంతో కీలకంగా మారిందని ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా మధుసూదన్‌రెడ్డి తెలిపారు. విలువలు గల రాజకీయం జగన్‌కే చెల్లిందని, ఆయన చెప్పడం వల్లే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పార్టీ సమన్వయకర్తలు జగన్‌మోహన్‌రెడ్డి, మురళీకృష్ణ, చెరకులపాడు శ్రీదేవి, హఫీజ్‌ఖాన్, పార్టీ నేతలు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement