అభిమానం పరవళ్లు | Sakshi
Sakshi News home page

అభిమానం పరవళ్లు

Published Thu, Jun 14 2018 6:57 AM

People Support To YS Jagan In Praja Sankalpa Yatra East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రతో రాజమహేంద్రవరం మురిసింది. పాదయాత్ర 188వ రోజు, జిల్లాలో రెండో రోజైన బుధవారం అడుగడుగునా ప్రజలు జననేతకు ఎదురేగి తమ ఆత్మీయతను పంచారు. వైఎస్‌ జగన్‌ రాకతో గోదావరి పల్లెలు మురిశాయి. పాదయాత్ర పొడవునా అందరికీ అభివాదం చేస్తూ తనను చూసేందుకు వచ్చిన అక్కాచెల్లెళ్లు, అవ్వాతాతలను, పిల్లలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. వైఎస్‌ జగన్‌ కరచాలనంతో వారు పులకరించిపోయారు. ఆయనే స్వయంగా సెల్ఫీలు తీసి ఇవ్వడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాదయాత్ర పొడవునా పలువురు తమ సమస్యలు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.  రాజమహేంద్రవరంలో మొదటిరోజు రాత్రి బస చేసిన ఐఎల్‌టీడీ జంక్షన్‌లోని ప్రదేశం నుంచి ఉదయం 8:45 గంటలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు పాదయాత్ర ప్రారంభమైంది. రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని ఆల్‌కట్‌తోట, 17వ డివిజన్, ధవళేశ్వరం లక్ష్మీనరసింహనగర్, ఎఫ్‌సీఐ గోడౌన్స్, వడ్డెర కాలనీ, సాయిబాబాగుడి, ధవళేశ్వరం మీదుగా కాటన్‌పేట వరకు పాదయాత్ర సాగింది. బస చేసిన ప్రాంతం నుంచి మధ్యాహ్న భోజన విరామ ప్రాంతం కాటన్‌ పేటకు చేరుకునేందుకు 4:15 గంటలు పట్టింది.

జననేతకు వినతుల వెల్లువ...
పాదయాత్ర పొడవునా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివిధ వర్గాల ప్రజలు వినతిపత్రాలు ఇచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఆశావర్కర్లు తమకు జీతాలు పెంచి, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని వినతిపత్రం ఇచ్చారు. ఏపీ ఎయిడెడ్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ నేతలు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని విన్నవించారు. అఖిలగాండ్ల, తెలికుల సంక్షేమ సంఘం నేతలు తమ సామాజిక వర్గాన్ని బీసీ–బీ వరుస 6 నుంచి బీసీ–ఏ కేటగిరీలోకి మార్చాలని వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణలో విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులను క్రమబద్ధీకరించినా మన రాష్ట్రంలో చేయలేదని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ రాజమహేంద్రవరం సర్కిల్‌ కార్మికులు తమ గోడును జననేతకు చెప్పుకున్నారు. గతంలో తమకున్న లైసెన్స్‌లను చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసిందని, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే లైసెన్సులన్నీ తిరిగి ఇప్పించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం జిల్లా శాఖ నేతలు వైఎస్‌ జగన్‌ను కోరారు. 50వేల లీటర్ల సామర్థ్యమున్న గోదావరి డెయిరీ ప్రస్తుతం 5వేల లీటర్లకు పడిపోయిందని, హెరిటేజ్‌ డెయిరీ కోసం దీనిని మూసివేసే స్థితికి తీసుకువచ్చారని తూర్పుగోదావరి జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం నేతలు విన్నవించారు.

సిబ్బందికి 10 నెలల నుంచి జీతాలు ఇవ్వడంలేదని, అన్ని బకాయిలు రూ.2 కోట్లు దాటాయని వివరించారు. బకాయిలు ప్రభుత్వం నుంచి వచ్చేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. చంద్రబాబు ప్రభుత్వం తమను ఎస్టీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, మన ప్రభుత్వం రాగానే తమను ఎస్టీల్లో చేర్చాలని వడ్డెర సంఘం నేతలు వినతిపత్రం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలోని కంటింజెంట్‌ కార్మికులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని విన్నవించారు. గోదావరి ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్‌ పీఈటీ టీచర్స్‌ ఖాళీల హేతుబద్ధీకరణ వెంటనే నిలుపుదల చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీచర్లు విన్నవించారు. తమ సమస్యలను పరిష్కరించాలని మోటారు బైక్‌ మెకానిక్స్‌ అసోసియేషన్‌ నేతలు వినతిపత్రం ఇచ్చారు. చంద్రన్న బీమా పేరుతో తమ సంక్షేమ బోర్డు నుంచి ఇతరులకు బీమా ఇస్తూ తమ నిధి రూ.360 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం వాడుకుందని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ భవన నిర్మాణ కార్మిక సంఘం వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చింది. వేలిముద్రలతో సంబంధం లేకుండా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందించాలని, పనిముట్ల కొనుగోలుకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. సీపీఎస్‌ ఉద్యోగులు, గ్రామీణ వైద్యులు తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకొచ్చారు. అందరి వినతులు స్వీకరించి వారి సమస్యలు విన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మనందరి ప్రభుత్వం వచ్చాక వాటన్నింటిని పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.

పాదయాత్రకు తరలివచ్చిన నేతలు...
జిల్లాలో రెండోరోజు పాదయాత్రకు పార్టీ ఉభయగోదావరి జిల్లాల రీజనల్‌ కోఆర్టినేటర్, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవిని త్యాగం చేసిన వైవీ సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు, అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కురసాల కన్నబాబు, కొయ్యే మోషేన్‌రాజు, సామినేని ఉదయభాను, పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, కరుముట్ల శ్రీనివాస్, కోన రఘుపతి, పార్టీ ప్రధాన కార్యదర్శి పినిపే విశ్వరూప్, రాష్ట్ర అధికార ప్రతినిధి కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, కాపు రామచంద్రారెడ్డి, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మల్లాది విష్ణు, వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కొండేటి చిట్టిబాబు, తోట సుబ్బారావునాయుడు, జ్యోతుల చంటిబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, అనంత ఉదయభాస్కర్,  రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, రావిపాటి రామచంద్రరావు, గిరిజాల బాబు, మింది నాగేంద్ర, కర్రి నాగిరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామినేని రమాదేవి, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి విప్పర్తి వేణుగోపాల్, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల నేతలు, జున్నూరు వెంకటేశ్వరరావు, కొల్లి నిర్మలాకుమారి, కర్రిపాపారాయుడు, రావూరి వెంకటేశ్వరరావు, మునికుమారి, మోతుకూరి వెంకటేష్, కార్పొరేటర్లు పిల్లి నిర్మల, పెంకె సుధారాణి, గుర్రం గౌతమ్, ఆర్‌వీవీఎస్‌ చౌదరి, పోలుకిరణ్‌మోహన్‌రెడ్డి, పోలు విజయలక్ష్మి, పిల్లి సిరిబాల, కేవీజీ కృష్ణారెడ్డి, గొల్లపల్లి డేవిడ్, మార్గాని గంగాధర్‌రావు, తాడి విజయ్‌భాస్కర్‌రెడ్డి, నెల్లి లక్ష్మీపతిరావు, మంతెన రవిరాజు, కోట చల్లయ్య, బీఎస్‌ వర్మ, రెడ్డి చంటి, ఎం. సత్యనారాయణ, కనుమూరి శ్రీనివాసరాజు, అప్పారి విజయ్‌కుమార్, శిలువూరి బాబిరాజు, పీఎస్‌ రాజు, పెరిచర్ల పల్లంరాజు, చల్లా ప్రభాకరరావు, యనమదల నాగేశ్వరరావు, చల్లా వెంకట సుబ్రహ్మణ్యం, నామాల శ్రీనివాస్, టి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

కొత్తపేట నియోజకవర్గంలోకి ఘన స్వాగతం
మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం విరామం తర్వాత 3:30 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభమైంది. ధవళేశ్వరంలోని కాటన్‌ బ్రిడ్జి మీదుగా కొత్తపేట నియోజకవర్గంలోకి అడుగిడింది. కాటన్‌ బ్రిడ్జిపైకి పాదయాత్ర అడుగిడే సమయంలో రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ రోజ్‌మిల్క్‌ సంస్థ నిర్వాహకులు అందించిన రోజ్‌మిల్క్‌ను ఆయన ఇష్టంగా తాగారు. రెండు క్యాన్ల               రోజ్‌మిల్క్‌ను నిర్వాహకులు పాదయాత్రలో పాల్గొన్నవారికి పంపిణీ చేశారు. ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద రాజమహేంద్రవరం రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు పాదయాత్రకు వీడ్కోలు పలుకగా, కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. బొబ్బర్లంక వద్ద అక్కచెల్లెమ్మలు గుమ్మడికాయతో జననేతకు దిష్టి తీశారు. గ్రామం సరిహద్దులోని ఆర్చికి వైఎస్సార్‌ సీపీ నవరత్నాలు తెలిపేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తోరణం ఆకట్టుకుంది. గోదావరి మధ్య డెల్టా కాలువలో తొమ్మిది పడవలపై వైఎస్‌ జగన్, చిర్ల జగ్గిరెడ్డి కటౌట్లతోపాటు వైఎస్సార్‌ యోగముద్రలో ఉన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పడవలో నవరత్న పథకాలను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పాదయాత్ర పొడవునా కాలువలో పయనించడం, కాలువకు ఆవలిగట్టున కూడా పెద్దఎత్తున జనం యాత్రను అనుసరించడం విశేషంగా ఆకర్షించింది.

Advertisement
Advertisement