ఆ పసివాడి ఫొటో.. రూ. 4.5 కోట్లు సేకరించింది | Sakshi
Sakshi News home page

ఆ పసివాడి ఫొటో.. రూ. 4.5 కోట్లు సేకరించింది

Published Fri, Sep 4 2015 7:58 PM

ఆ పసివాడి ఫొటో.. రూ. 4.5 కోట్లు సేకరించింది - Sakshi

రోమ్: ఉగ్రవాద దాడులు, బోటు యజమానుల అత్యాశకు బలైన మూడేళ్ల చిన్నారి.. ఈ లోకాన్ని వీడిపోతూ ఎందరికో ఆశాదీపంలా మారాడు. మధ్యదరా సముద్రం నుంచి కొట్టుకొచ్చిన ఈ పసివాడి మృతదేహం ఫొటోను చూసి చలించిన ప్రపంచం.. శరణార్థులను ఆదుకునేందుకు కోట్లాది రూపాయలు విరాళాలు పంపింది. పాపం ఈ పసివాడు చనిపోతూ పరోక్షంగా ఎంతో మందికి సాయపడుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి...  

ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు, కుర్దు సాయుధుల పోరాటంతో నలిగిపోతున్న సిరియాలోని కొబాని పట్టణానికి చెందిన అబ్దుల్లా, తన భార్య రేహన్, కుమారులు అయలాన్ కుర్దీ (3), గాలిప్ (5)లతో దేశం వదిలివెళ్తుండగా.. మధ్యదరా సముద్రంలో పడవ మునిగిపోవడంతో అబ్దుల్లా తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయాడు. అయలాన్ కుర్దీ మృతదేహం టర్కీ తీరానికి కొట్టుకువచ్చింది. దీన్ని చూసిన ప్రపంచం నివ్వెరపోయింది.  పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. సోషల్ సైట్లలో ఎందరో అశ్రుతర్పణాలు అర్పించారు. శరణార్థులను ఆదుకునేందుకు కోట్లాది విరాళాలు పంపించారు.

ఈ బాలుడి ఫొటోను చూసి చలించిపోయిన మానవతావాదులు.. ద చారిటీ మైగ్రెంట్ ఆఫ్షోర్ ఎయిడ్ స్టేషన్కు 4.5 కోట్ల రూపాయలు విరాళాలుగా పంపారు. గత రెండు రోజుల్లో పదివేల మంది దాతలు స్పందించినట్టు ఈ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమెరికా, బ్రిటన్లో పాటు బ్రెజిల్, జర్మనీ, టర్కీ తదితర దేశాల నుంచి విరాళాలు పంపారు. మధ్యదరా సముద్రంలో చిక్కుకున్న శరణార్థులను ఈ ఛారిటీ సంస్థ ఆదుకుంటోంది.  సిరియాలో అంతర్యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ దేశాస్తులు యూరప్ వెళ్లేందుకు చిన్నచిన్న బోట్లలో మధ్యదరా సముద్రాన్ని దాటే సాహసం చేస్తున్నారు. జనాన్ని అక్రమంగా తరలించే ముఠాల అత్యాశతో బోట్లు కిక్కిరిసిపోతున్నాయి. కల్లోల సముద్రంలో ఈ బోట్లు మునిగిపోతుండటంతో వేల మంది చనిపోతున్నారు.

Advertisement
Advertisement