గోవాయువు | Sakshi
Sakshi News home page

గోవాయువు

Published Sun, Apr 23 2017 1:06 AM

గోవాయువు

సాధుజంతువులైన గోవులను పవిత్రంగా భావించి, వాటిని పూజించడంలో మనకు తరతరాల చరిత్ర ఉంది. రకరకాల ఆధ్యాత్మిక, ఆయుర్వేద ప్రయోజనాల కోసం మన దేశంలో గోవుల ఘన, ద్రవ విసర్జకాలనే మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. అయితే, ఆర్య వారసులైన జర్మనీ జనాలు ఈ విషయంలో మనకంటే ముందంజలో ఉన్నారు. ఎలాగంటారా..? వాళ్లు ఏకంగా గోవుల వాయు విసర్జకాన్ని కూడా వాడటం మొదలుపెట్టారు.

 గోవుల అపాన వాయువును విక్రయిస్తే లాభసాటిగా ఉంటుందనే ఆలోచన వచ్చింది డేనియేలా డోరర్‌ అనే మహిళకు. జర్మనీలో ఆమె నివాసం ఆడ్ల్‌కోఫెన్‌ అనే మారుమూల గ్రామం. కాబట్టి ఆచరణకు పెద్దగా కష్టమేమీ కాలేదు. కొందరు సిబ్బందిని నియమించుకుని, గోవుల అపానవాయు సేకరణ ప్రారంభించింది. అలా సేకరించిన గోవాయువును చూడ చక్కని డబ్బాల్లో ప్యాక్‌ చేయించి ‘స్టాల్‌ డఫ్ట్‌’ బ్రాండ్‌ పేరిట ఆన్‌లైన్‌లో ఎడాపెడా అమ్మకాలు మొదలుపెట్టింది.

ఈ పవిత్ర గోవాయువు డబ్బా ధర కేవలం ఎనిమిది డాలర్లు (రూ.515) మాత్రమే! ఇంతకీ గోవాయువు దేనికి పనికొస్తుందని మీ సందేహమా? ‘మరేంలేదు. ఉద్యోగ రీత్యా నగరాలకు వలస వెళ్లి పల్లెకు దూరమైన వారికి పల్లెల మీద, పల్లెల్లోని ఇళ్ల మీద ఎంతో కొంత బెంగ ఉంటుంది. గోవాయువును ఆఘ్రాణిస్తే వాళ్లకు కొంతలో కొంతైనా ఇళ్ల మీద బెంగ తీరినట్లుగా ఉంటుంది. అందుకే ఈ వ్యాపారంలోకి దిగాను’ అని వివరిస్తోంది డేనియేలా.

Advertisement
Advertisement