Sakshi News home page

ఆటో శంకర్

Published Sun, Jan 31 2016 1:29 AM

ఆటో శంకర్ - Sakshi

 ‘‘వెధవ గోల... రాత్రీ లేదు పగలూ లేదు. పండగా లేదు పబ్బం లేదు. ఎప్పుడు చూసినా డ్యూటీయే’’... తిట్టుకుంటూ నడుస్తున్నాడు కాని స్టేబుల్ కణ్నన్. రెండు వారాలుగా సెలవు కూడా లేకుండా పని చేస్తున్నాడేమో... పరమ విసుగ్గా ఉందతనికి. ‘‘పోనీ ఇంత కష్టపడి నందుకు ఏమైనా ఫలితం ఉంటుందా అంటే అదీ లేదు. ఎగిరి తన్నినా అంతే, ఎగరకుండా తన్నినా అంతే అన్నట్టుగా ఉందీ బతు...’’మాట పూర్తి చేయకుండా చప్పున ఆగిపోయాడు కణ్నన్. అకస్మాత్తుగా వచ్చి ఎదురుగా నిలబడిన పాపని విస్తుపోయి చూశాడు. పాప స్కూల్ యూనిఫామ్‌లో ఉంది. బాగా రొప్పు తోంది. కళ్ల నిండా భయం. నిలువునా వణికిపోతోంది. ‘‘ఏంటమ్మా? ఎందు కలా భయపడుతున్నావ్? ఏమయ్యింది?’’ అన్నాడు పాప తల నిమురుతూ.
 
  ‘‘మరే... అంకుల్... ఓ ఆటో డ్రైవర్ నన్ను ఎత్తుకుపోవాలని చూశాడు’’ అంది తడబడుతూ, ఆగి ఆగి చెబుతూ.‘‘అవునా? ఎవరు? అతను నీకు తెలుసా?’’ అడిగాడు. తల అడ్డంగా ఊపింది. ‘‘తెలీదంకుల్. నేను ట్యూషన్ నుంచి వస్తుంటే వైన్ షాపు ముందు ఓ ఆటో ఆగివుంది. డ్రైవర్ నన్ను పిలిచి, ఆటో ఎక్కితే ఇంటి దగ్గర దింపుతానన్నాడు. నేను వద్దంటే బలవంతంగా ఎక్కించబోయాడు. తప్పించుకుని వచ్చేశాను.’’పాప మాట వినగానే అటువైపు పరుగెత్తాడు కణ్నన్. కానీ అక్కడ ఆటో లేదు. అతని మనసులో ఏదో మెదిలినట్టయ్యింది. హుటాహుటిన స్టేషన్‌కి బయలుదేరాడు.
   
 ‘‘అంటే ఇన్ని నేరాలకూ కారణం ఓ ఆటోడ్రైవర్ అంటావా?’’... కణ్నన్ ముఖంలోకి చూస్తూ అన్నాడు ఇన్‌స్పెక్టర్. అవునన్నట్టు తలూపాడు కణ్నన్. ‘‘అతనే హంతకుడని అనడం లేదు సర్. అతను కూడా అయి ఉండొచ్చేమో అంటున్నాను. ఇన్నాళ్లూ మనం చాలా యాంగిల్స్‌లో ఆలోచించాం. ఫలితం లేదు కదా! ఇప్పుడు ఈ యాంగిల్‌లో ఆలోచించి చూద్దాం’’ అన్నాడు తడబడకుండా. ఆలోచనలో పడ్డాడు ఇన్‌స్పెక్టర్. నిజమే. రెండేళ్లు... తొమ్మిది మిస్సింగ్ కేసులు... చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఏ ఒక్కరి జాడా తెలియలేదు.
 
 ఎన్ని రకాలుగా ఇన్వెస్టిగేట్ చేసినా కేసులో ముడి వీడటం లేదు. కణ్నన్ చెప్పినట్టు చేస్తే? అదే కరెక్టనిపించింది ఇన్‌స్పెక్టర్‌కి. వెంటనే మద్రాసులోని ఆటోడ్రైవర్లందరి మీదా కన్నేసి ఉంచమని తన టీమ్‌ని ఆదేశించాడు. ప్రతి ఆటో డ్రైవర్‌నీ పరిశీలించాలంటూ తమిళనాడులోని మిగతా స్టేషన్లన్నింటికీ మెసేజ్ పంపాడు. కణ్నన్ ఆలోచన, ఇన్‌స్పెక్టర్ ఆచరణ వృథా పోలేదు. పల్లవరం ప్రాంతంలో ఓ యువతిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించే క్రమంలో ఖాకీల చేతికి చిక్కాడు శంకర్. ద సెన్సేషనల్ అండ్ నటోరియస్ కిల్లర్... గౌరీ శంకర్. విచారణలో శంకర్ చెప్పిన విషయాలు విని పోలీసులకు సైతం చెమటలు పట్టాయి. వెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగిన శంకర్, జీవనోపాధిని వెతుక్కుంటూ మద్రాసు వచ్చాడు. ఆటో నడపడం మొదలు పెట్టాడు. దానితో పాటు అక్రమంగా మద్యం తరలించేవాడు.
 
  ఓసారి అనుకోకుండా ఒంటరిగా కంటపడిన లలిత అనే అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఆధారాలు దొరక్కూడదని ఆమెను చంపేసి, పెట్రోల్ పోసి కాల్చేశాడు. మిగిలిన అవశేషాలను తీసుకెళ్లి సముద్రంలో కలిసేశాడు. అప్పట్నుంచి అతనిలో రాక్షసత్వం పురివిప్పింది. రెండేళ్లలో వరుసగా మరో ఎనిమిది మంది అమ్మాయిల్ని ఎత్తుకెళ్లి, మానభంగం చేసి, అదే పద్ధతిలో చంపేశాడు. ఈ మారణకాండలో అతడి తమ్ముడు మోహన్, బావమరిది ఎల్దీన్, స్నేహితులు శివాజీ, జయవేలు, రాజారామన్, రవి, పళని కూడా సహకరించారు. చివరికి శుభలక్ష్మి అనే పాప కిడ్నాప్‌కి చేసిన విఫలయత్నం వారిని పట్టించింది.
   
 ‘‘ఇదంతా ఎందుకు చేశావ్?’’... అడిగాడు ఇన్‌స్పెక్టర్.
 పగలబడి నవ్వాడు శంకర్. ‘‘ఇవన్నీ సినిమాల్లో చూసినప్పుడు చాలా కిక్కిచ్చేవి సర్. నన్నూ అలా చేయమని మనసు పోరు పెట్టేది. అందుకే చేశాను.’’అతని సమాధానం, అతడిలోని రాక్షసత్వం ఇన్‌స్పెక్టర్‌నే కాదు, యావత్ దేశాన్నీ అవాక్కయ్యాలే చేశాయి. న్యాయ స్థానం శంకర్‌ని క్షమించడానికి నిరాకరించింది. ఉరి తీయమంటూ ఆదేశించింది. ఏప్రిల్ 27, 1995న ఆ నలయ్యొక్కేళ్ల రాక్షసుడు, సేలం సెంట్రల్ జైల్లో ఉరికొయ్యకు వేళ్లాడాడు. అతడికి సహకరించిన వారందరికీ జీవిత ఖైదులు పడ్డాయి. దాంతో దేశాన్ని వణికించిన కొన్ని మానవ మృగాల రాక్షసకాండకు శాశ్వతంగా తెరపడింది!

Advertisement

తప్పక చదవండి

Advertisement