స్టార్‌ బాగుంటే..! | Sakshi
Sakshi News home page

స్టార్‌ బాగుంటే..!

Published Sat, Apr 28 2018 12:54 AM

Success story of  Vijay Sethupathi - Sakshi

విజయ్‌ సేతుపతి! అంటే ఎవరు? స్టార్‌. ఎవరికి స్టార్‌? తమిళులకి స్టార్‌. అయితే మనకేంటి? స్టార్‌ బాగుంటే... స్టార్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇవ్వగలిగితే... స్టార్‌ కావాలని కష్టపడగలిగితే ఆ స్టార్‌ ఎవరికైనా స్టార్‌ కాగలడని నిరూపించాడు. నిన్న మొన్నటి వరకు అతడు జూనియర్‌ ఆర్టిస్ట్‌. ఇవాళ తమిళంలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో.. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవితో నటించనున్నాడు. ఆ స్టార్‌ స్టోరీ ఇది.


సార్‌... ఒరు కథ సొల్లట్టుమా... అదే సార్‌.. ఒక కథ చెప్పనా? హార్డ్‌వర్క్‌కి లక్‌ తోడైతే పెరియ పొజిషన్‌ ఖాయం సార్‌. ఎంత పెద్ద పొజిషన్‌ అంటే సైడ్‌ క్యారెక్టర్స్‌ నుంచి మెయిన్‌ క్యారెక్టర్స్‌కి మారిపోతారు సార్‌. ఇది కథ ఇల్లే. అవును.. కథ కాదు. ఈ కథలో నాయకుడు  ‘విజయ్‌ సేతుపతి’. ఇంద విజయ్‌ సేతుపతి యారప్పా? ఎవరూ? ఒకప్పుడు సైడ్‌ క్యారెక్టర్లు వేసినోడు.. ఇప్పుడు ‘స్టార్‌ హీరో’.

మనోళ్లకి ‘పిజ్జా’తో పరిచయం. తమిళోళ్లకి ‘పిజ్జా’తోనే స్టార్‌ అయ్యాడు. ఇప్పుడు అక్కడ క్రేజీ ప్రాజెక్ట్స్‌ చేస్తూ దూసుకుపోతున్నారు. అతడు చేసిన ‘విక్రమ్‌ వేదా’ ఎంత పెద్ద హిట్‌ అంటే మన ‘బాహుబలి’ తమిళ వెర్షన్‌ కలెక్షన్లను కూడా ఆ సినిమా దాటేసింది. ఇంతగా ఎదిగిన ఈ హీరో ప్రయాణం ఒక సాధారణ స్థాయి నుంచి మొదలైందని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

యావరేజ్‌ స్టూడెంట్‌
విజయ్‌ సేతుపతి తమిళనాడులోని రాజపాళయమ్‌లో పుట్టాడు. ఆరో తరగతి అప్పుడు ఫ్యామిలీ చెన్నైకి షిఫ్ట్‌ అయింది. బిలో యావరేజ్‌ స్టూడెంట్‌. పోనీ స్పోర్ట్స్‌లో బెస్టా అంటే అదీ ఇల్లే. వేరే యాక్టివిటీస్‌లోనూ అంతే. ఎలాగో ‘బీకామ్‌’ కంప్లీట్‌ చేశాడు. చదువుకునేటప్పుడు ప్యాకెట్‌ మనీ కోసం సేల్స్‌మేన్‌గా, టెలిఫోన్‌ బూత్‌ ఆపరేటర్‌గా, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో క్యాషియర్‌గా... ఇలా ఏ పని దొరికితే అది  చేశాడు. పెద్దగా డబ్బున్న ఫ్యామిలీ కాదు. ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. ఇంటి బాధ్యత పంచుకోవాలనుకున్నాడు.

కాలేజీ ఇలా ఫినీష్‌ అయిందో లేదో అలా ఒక హోల్‌సేల్‌ సిమెంట్‌ షాప్‌లో అసిస్టెంట్‌ అకౌంటెంట్‌గా చేరిపోయాడు. చెప్పుకోదగ్గ జీతం కాదు. ఇలా అయితే జీవితం ఎదుగు బొదుగూ లేకుండా ఉంటుందనుకున్నాడు. సరిగ్గా అప్పుడు దుబాయ్‌ నుంచి ఓ ఆఫర్‌. ఇక్కడ తీసుకుంటున్న జీతం కన్నా నాలుగు రెట్లు ఎక్కువ. ఫ్లైట్‌ ఎక్కాడు. తర్వాత ప్రేమలో పడ్డాడు.

జాబ్‌తో కాదు. ఆన్‌లైన్‌లో ఓ అమ్మాయితో. పేరు జెస్సీ. కేరళ అమ్మాయి. ఈ ఆన్‌లైన్‌ లవ్‌ ఉంగరాలు మార్చుకునే దాకా వచ్చేసింది. జెస్సీని పెళ్లాడటం కోసం దుబాయ్‌ వెళ్లిన రెండేళ్లకే ఇండియా వచ్చేశాడు విజయ్‌ సేతుపతి. అక్కడి జాబ్‌ కూడా నచ్చలేదు. 2003లో జెస్సీతో అతని వివాహం జరిగింది. ఇక్కడితో ఈ కథ సుఖాంతం. కానీ ‘జాబ్‌’ కహానీ మాత్రం సీరియల్‌లా సాగింది.

అకౌంటెంట్‌ టు ఆర్టిస్ట్‌
ఇక్కడ నచ్చక అక్కడ.. అక్కడ నచ్చక ఇంకో చోట.. ఒకసారి ఫ్రెండ్స్‌తో ‘ఇంటీరియర్‌ డెకరేషన్‌’ బిజినెస్, ఆ తర్వాత రెడీమేడ్‌ కిచెన్స్‌ మార్కెటింగ్‌ కంపెనీలో జాబ్‌. అదీ వదిలేశాడు. ఆ తర్వాత ‘కూత్తుపట్టరై’ (థియేటర్‌ గ్రూప్‌)లో అకౌంటెంట్‌గా చేరాడు. థియేటర్‌ గ్రూప్‌లో అందరూ యాక్ట్‌ చేస్తుంటే విజయ్‌ ఆసక్తిగా చూసేవాడు.

అప్పటివరకూ దేని మీదా అంత ఆసక్తి ఉండేది కాదు. పైగా ఫేమస్‌ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్‌ బాలు మహేంద్ర ‘నీది ఫొటోజెనిక్‌ ఫేస్‌’ అన్నారు. అంతే.. ‘నాక్కావాల్సిన జాబ్‌ ఇదే’ అనుకున్నాడు. థియేటర్‌ గ్రూప్‌కి ఎంతోమంది వస్తుంటారు.. వెళ్తుంటారు.. మెల్లిగా పరిచయాలేర్పడ్డాయి. కథ వేరే దారి తీసుకుంది. ఫ్రమ్‌ అకౌంటెంట్‌ టు ఆర్టిస్ట్‌.

‘పిజ్జా’... ఓ మంచి టర్నింగ్‌
2004లో ‘యం. కుమరన్‌ సన్నాఫ్‌ మహాలక్షి’ సినిమాలో ఓ చిన్న రోల్‌. ఆ తర్వాత చిన్న చిన్న వేషాలు, స్టార్‌ హీరోల సినిమాల్లో ఫ్రెండ్‌ వేషాలు. ధనుష్‌ హీరోగా అతని అన్న సెల్వరాఘవన్‌ తీసిన ‘పుదు ప్పేటై్ట’ (2006)లో కూడా ఓ క్యారెక్టర్‌ చేశాడు. ఆ సమయంలో విజయ్‌ని ఎంకరేజ్‌ చేసిన దర్శకుల్లో సుశీంద్రన్‌ ఒకరు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఒకరు. కార్తీక్‌తో కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌ కూడా తీశాడు. అంతకుముందు ఎన్ని ఉద్యోగాలు చేసినా విజయ్‌ సేతుపతికి నచ్చలేదు.

కానీ ‘సినిమా’ నచ్చింది. చిన్నదో పెద్దదో ఇక్కడే ఉండాలని ఐదారేళ్ల పాటు ఏ క్యారెక్టర్‌ వస్తే అది చేశాడు. ఏ పాత్ర ఇచ్చినా న్యాయం చేశాడు. అందుకే సీను రామసామి అనే దర్శకుడు తీస్తున్న ‘తెన్‌ మేర్కు పరువకాట్రు’ కథకు హీరోగా సరిపోతాడని రికమండ్‌ చేశారు సుశీంద్రన్‌. ఆ సినిమాలో హీరోగా చేసిన వెంటనే ‘సుందర పాండియన్‌’లో విలన్‌. అప్పుడొచ్చింది ‘పిజ్జా’కి చాన్స్‌. అదే మంచి మలుపు అయింది.

విజయ్‌ సేతుపతి హీరోగా కార్తీక్‌ సుబ్బరాజు తీసిన ‘పిజ్జా’ (2012) సూపర్‌ డూపర్‌ హిట్‌. కోటిన్నరతో తీసిన ‘పిజ్జా’ దాదాపు 18 కోట్లు కలెక్ట్‌ చేసింది. విజయ్‌ సేతుపతిని కోట్లు పారితోషికం తీసుకునే రేంజ్‌ హీరోని చేసేసింది. వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ చేసేసింది. ‘సూదు కవ్వమ్‌’, ‘జిగర్‌దండా’, ‘నానుమ్‌ రౌడీదాన్‌’, ‘విక్రమ్‌ వేదా’... ఇలా వరస హిట్స్‌. ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తున్నాడు విజయ్‌ సేతుపతి. ఇప్పుడు ఈ హీరోగారి కాల్షీట్స్‌ కోసం చాలామంది నిర్మాతలు వెయిటింగ్‌. ఇది కథ కాదు. నిజం. విజయ్‌ సేతుపతి జీవిత కథ. ‘‘అవకాశం తెచ్చుకోవడం ఈజీ. బ్రేక్‌ తెచ్చుకోవడం కూడా ఈజీ. కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం.

ఒక్కసారి బ్రేక్‌ వస్తే అంతా సెట్‌ అని ఒకప్పుడు అనుకునేవాణ్ణి. బట్‌.. ఆ బ్రేక్‌ని నిలబెట్టుకోవడం చాలా టఫ్‌ అని అర్థమైంది. నా లైఫ్‌లో మార్పు లేదు. అప్పుడూ కొన్ని ఆనందాలు, కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. స్టార్‌డమ్‌ అంతా ఇచ్చేస్తుందనుకుంటే పొరపాటే. లైఫ్‌ ఎప్పుడూ చాలెంజే. గెలవాలి. గెలుస్తూనే ఉండాలి. అప్పుడే మజా’’ అంటున్నారు విజయ్‌ సేతుపతి.

సైరాకి సహాయంగా...
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘సైరా’. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతిని తీసుకున్నారు దర్శకుడు సురేందర్‌ రెడ్డి. తమిళనాడు నుండి ఇక్కడికి వచ్చే ఓ దళానికి నాయకుడిగా ఈ సినిమాలో విజయ్‌ కనిపిస్తారని సమాచారం. పాత్ర పేరు ‘పాండ్య’ అని తెలిసింది. సైరాకి సహాయం చేసే పాత్ర ఇది అని భోగట్టా.  


రజనీతో ఢీ
‘కాలా’ తర్వాత సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ‘పిజ్జా, మెర్క్యూరీ’ చిత్రాల ఫేమ్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఓ సినిమా నిర్మించనుంది. ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి నటించనున్నారు. అయితే ఇది విలన్‌ పాత్ర అని సమాచారమ్‌.

విజయ్‌ సేతుపతి కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాలు ‘పిజ్జా’, ‘జిగర్‌దండా’, ‘ఇరైవి’ కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించనవే. హీరోగా మంచి మైలేజ్‌ ఇచ్చే క్యారెక్టర్లు ఇచ్చిన కార్తీక్‌.. విజయ్‌ సేతుపతి కోసం రజనీ సినిమాలో బ్రహ్మాండమైన క్యారెక్టర్‌ రాశారట. రజనీతో కార్తీక్‌ సుబ్బరాజ్, విజయ్‌ సేతుపతి తొలిసారి కలిసి పనిచేయనున్నారు.

మణిరత్నం ‘నవాబ్‌’లో...
ఏ ఆర్టిస్ట్‌కైనా మణిరత్నం సినిమాలో నటించాలని ఉంటుంది. విజయ్‌ సేతుపతికి కూడా ఆ కల ఉంది. అది ‘నవాబ్‌’తో నెరవేరుతోంది. ప్రస్తుతం ఆన్‌ సెట్స్‌లో ఉందీ సినిమా. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. తమిళ వెర్షన్‌కి ‘చెక్క చివంద వానమ్‌’ అన్నది టైటిల్‌. అరవిందస్వామి, శింబు, విజయ్‌ సేతుపతి, అరుణ్‌ విజయ్, జ్యోతిక, అదితీ రావ్‌ హైదరీ, ఐశ్వర్య రాజేశ్, ప్రకాశ్‌ రాజ్‌ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ఇందులో విజయ్‌ సేతుపతిది పోలీసాఫీసర్‌ క్యారెక్టర్‌.

విధి విచిత్రమైనది
‘పుదుప్పేటై్ట’లో చిన్న క్యారెక్టర్‌ చేసినప్పుడు విజయ్‌ సేతుపతి ఊహించి ఉండడు... భవిష్యత్తులో ఆ సినిమా హీరో ధనుష్‌ తనతో సినిమా తీస్తాడని. విధి విచిత్రమైనది. 2015లో విజయ్‌ సేతుపతితో తన వండరబార్‌ ఫిలింస్‌పై ధనుష్‌ ‘నానుమ్‌ రౌడీదాన్‌’ సినిమా తీశాడు. విఘ్నేష్‌ శివన్‌ దానికి దర్శకుడు. నయనతార హీరోయిన్‌. అప్పటికే విఘ్నేష్, నయన లవ్‌లో ఉన్నారని ఓ టాక్‌. ఆ సంగతలా ఉంచితే.. 15 కోట్లతో తీసిన ఆ సినిమా 55 కోట్లు కలెక్ట్‌ చేసింది. విజయ్‌ సేతుపతి రేంజ్‌ని అమాంతంగా పెంచింది.

ఏ పాత్ర అయినా ఓకే
విజయ్‌ సేతుపతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి వెనకాడడు. ఏ రెండు సినిమాల్లోనూ ఒకేలా కనిపించడు. ‘ధర్మదురై’లో క్లీన్‌ షేవ్‌తో, ‘విక్రమ్‌ వేదా’లో నెరిసిన గడ్డంతో ‘జుంగా’లో స్టైలిష్‌ డాన్‌లా, ఇప్పుడు చేస్తున్న ‘సీదకాత్తి’లో ఓల్డేజ్‌ గెటప్‌లో.. ఇలా ఎలా అంటే అలా మారిపోతాడు.

ఈ ‘సీదకాత్తి’ విశేషం ఏంటంటే.. విజయ్‌ సేతుపతి హీరోగా చేసిన రెండో సినిమా ‘నడువుల కొంజెం పక్కత కానోమ్‌’ (2012) దర్శకుడు బాలాజీ ధరణీధరన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. అప్పటినుంచి ఈ దర్శకుడు వేరే సినిమా చేయలేదు. ‘ఒరు పక్క కథై’ అనే సినిమా చేస్తున్నాడు. దాని స్టేటస్‌ కూడా సరిగ్గా తెలియదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్టార్‌గా ఎదిగిన విజయ్‌ సేతుపతి అతనికి డేట్స్‌ ఇచ్చాడు.

ప్రొడ్యూసర్‌ – సింగర్‌ – లిరిసిస్ట్‌
విజయ్‌ సేతుపతి ప్రొడ్యూసర్‌గా మారి తీసిన చిత్రం ‘ఆరెంజ్‌ మిఠాయి’. కేవలం ప్రొడ్యూసర్‌గా మాత్రమే కాకుండా ఈ సినిమాకు కథ కూడా అందించారు. ఇందులో ‘స్ట్రెయిటా పోయి..’. ‘ఒరే ఒరు ఊరులో..’ పాటలు రాసి పాడటం విశేషం. విజయ్‌ సేతుపతి మల్టీ టాలెంటెడ్‌.

Advertisement
Advertisement