అయుత చండీయాగానికి సన్నాహాలు | Sakshi
Sakshi News home page

అయుత చండీయాగానికి సన్నాహాలు

Published Sat, Nov 28 2015 4:04 AM

అయుత చండీయాగానికి సన్నాహాలు - Sakshi

సాక్షి, హైదరాబాద్/జగదేవ్‌పూర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో తలపెట్టిన అయుత చండీయాగం నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. శుక్రవారం సీఎం దంపతులు నవ చండీయాగం నిర్వహించారు. అయుత చండీయాగానికి ముందు చేపట్టాల్సిన కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రత్యేక పూజలు చేశారు. గురువారం రాత్రే కేసీఆర్ దంపతులు వ్యవసాయ క్షేత్రానికి చేరుకోగా.. శుక్రవారం ఉదయం శృంగేరి పీఠం వేద పండితులు వచ్చారు. చండీయాగం నిర్వహించే స్థలంలో నవ చండీయాగం నిర్వహించారు. కేసీఆర్, ఆయన సతీమణి శోభ పట్టు వస్త్రాలు ధరించి నవ చండీయాగంలో పాల్గొన్నారు. ఉదయం 10:31 గంటలకు శృంగేరి వేద పండితులు, 12 మంది బ్రాహ్మణులు నవ చండీయాగాన్ని ప్రారంభించారు.

వేద పండితులు చండీ దేవతకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితులు, సీఎం దంపతులు మంగళహారతి ఇచ్చారు. నవ చండీయాగం సాయంత్రం 3:50 గంటలకు వరకు కొనసాగింది. ప్రస్తుతం నవచండీయాగం నిర్వహించామని, ఇంకా 10 రకాల యాగాలను నిర్వహించాల్సి ఉందని శృంగేరి వేద పండితులు ఫణి శశాంక్‌శర్మ తెలిపారు. డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఐదు రోజుల పాటు అయుత చండీయాగం నిర్వహిస్తామని చెప్పారు.

 యాగానికి రాష్ట్రపతి!
 వ్యవసాయ క్షేత్రం సమీపంలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ యాగానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాగం నిర్వహణకు కేరళ నుంచి అయిదు వేల మంది పండితులను రప్పిస్తున్నా రు. పది వేల పారాయణాలు, వెయ్యి హోమాలు ఏకకాలంలో నిర్వహిస్తారు. ఈ భారీ యాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా రాష్ట్రపతి, ప్రధానిని కలిసిన కేసీఆర్ చండీయాగానికి రావాలని ఆహ్వానించారు. దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్ 18 నుంచి 31 వరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. దాదాపు రెండు వారాల పాటు ఆయన హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఇదే వ్యవధిలో చండీయాగం జరుగనుంది. సీఎం ఆహ్వానం మేరకు 27వ తేదీన రాష్ట్రపతి చండీయాగానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. అందుకు సంబంధించి సీఎం కార్యాలయానికి రాష్ట్రపతి భవన్ నుంచి ప్రాథమిక సమాచారం అందింది.

Advertisement
Advertisement