కాజ్‌వేకు గండి | Sakshi
Sakshi News home page

కాజ్‌వేకు గండి

Published Fri, Sep 23 2016 11:14 PM

కొట్టుకు పోయిన మాతుమూరు–తాడూరు గ్రామాల మద్య కాజ్‌వే

పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు, వాగులు
మాతుమూరు (పాచిపెంట), సాలూరు: కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని తాడూరు – మాతుమూరు గ్రామాల మధ్య వట్టిగెడ్డపైనున్న కాజ్‌వే కొట్టుకుపోయింది. దీంతో సుమారు 20 గిరిజన గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. కాజ్‌వే మరమ్మతుల సమయంలో ఇంజినీరింగ్‌ అధికారులు సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే కాజ్‌వే కొట్టుకుపోయిందని వైఎస్సార్‌సీపీ నాయకుడు బోను మురళి ఆరోపించారు. అలాగే పాచిపెంట సమీపంలోని పెద్దగెడ్డ జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది.  జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 213.8 మీటర్లు కాగా శుక్రవారం ఉదయానికి 212.9 మీటర్లకు చేరడంతో వంద క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు.  
 
పొంగుతోన్న గెడ్డలు
ఒడిశాప్రాంత కొండల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో సాలూరు నియోజకవర్గంలోని వాగులు, వంకలు, గెడ్డలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.  వేగావతినది వరదనీటితో గంభీరంగామారింది. నిన్నమొన్నటి వరకు చిన్నపాటి పిల్లకాలువను తలపించిన నది, నేడు వరదనీటితో కళకళలాడుతోంది. దీంతో కాకులతోటవద్దవున్న ప్రధాన తాగునీటి సరఫరా విభాగంలో ఇన్ఫిల్టరేషన్‌ బావిలోనికి వరదనీరు చేరడంతో పట్టణంలోని కొన్ని ప్రాంతాలకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగింది. అలాగే పాచిపెంట మండలంలోని వేగావతినదితోపాటు, వట్టిగెడ్డ సైతం ఉరకలేస్తున్నాయి. 
చెరువులకు గండ్లు
మెంటాడ మండలంలోని  గుర్ల, వానిజ, పోరాం గ్రామాల్లోని పడేబంద, రెల్లబంద, వలసబందలతో పాటు పలు సాగునీటి కాలువలకు గండ్లు పడ్డాయి. అలాగే గుర్ల గ్రామం నుంచి విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీకి వెళ్లే రోడ్డు కోతకు గురైంది. దీంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు.
 
 
నేలమట్టమైన ఏడిళ్లు
 సాలూరు మండలంలో వర్ష బీభత్సానికి సారిక పంచాయతీలో మూడు, శివరాంపురంలో నాలుగిల్లు నేలమట్టమయ్యాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అలాగే   సువర్ణముఖి, గోముఖి, వట్టిగెడ్డ, తదిర నదీ పరీవాహక ప్రాంతాల్లో  సాగుచేస్తున్న  పంటలకు కొంతమేర నష్టం వాటిల్లింది. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఎస్సై గణేష్‌ ఆధ్వర్యంలో సిబ్బంది పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. 
 
                  

Advertisement
Advertisement